హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. 30 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా నగదు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న పేకాట దందా బట్టబయలైంది. ఈ దాడుల్లో 6.75 లక్షల నగదు, 34 ఫోన్లు, ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, ఎస్‌వోటీ కలిసి జరిపిన ఈ దాడుల్లో నాగశౌర్య ఫామ్‌హౌస్ పై కూడా చెకింగ్ జరిగింది. అక్కడ గుత్తా సుమన్ కుమార్ అనే వ్యక్తి తో పాటు మరో 30 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై విచారణ చేపట్టారు. గుత్తా సుమన్ కుమార్ హైదరాబాద్‌లో పలుచోట్ల ఫామ్‌హౌస్‌లను అద్దెకు తీసుకొని పేకాట, క్యాసినో ఆడిస్తున్నట్టు వెల్లడైంది. సుమన్ కుమార్ హైదరాబాద్‌లో చాలా మందిని ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్‌ల పేరుతో మోసం చేశాడని, అతని ఫోన్లో పలువురు వీఐపీల నెంబర్లు, ఆంధ్రా, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ప్రముఖులతో ఫోటోలు దిగి సుమన్ మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఎన్జీవో పేరుతో విరాళాలు ఇస్తున్నట్లుగా కూడా బుకాయించాడు. ప్రస్తుతం గుత్తా సుమన్‌కుమార్ అక్రమాలపై ఎస్‌వోటీ ఆరా తీస్తోంది.
Read Also : ఫామ్ హౌస్ వ్యవహారంలో నాగశౌర్య తండ్రికి నోటీసులు?