నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. జులై 8వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు టీజర్ విడుదల చేశారు.
‘నేను, నా వల్లే సాధ్యమైంది, నా సక్సెస్‌కి కారణం నేనే’ అంటూ స్వార్థంతో పరుగులు పెట్టే ఓ యువకుడు.. ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడు? తన జీవితంలో ఏం కోల్పోయాడు? తన తప్పుల్ని గ్రహించి, తనని తాను ఎలా సరి చేసుకున్నాడన్న నేపథ్యంతోనే ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు టీజర్ చూస్తుంటే తెలిసిపోతుంది. ‘ప్రేమమ్’ తరహాలోనే మూడు ప్రేమకథలు ఉన్నట్టు టీజర్‌తో స్పష్టమవుతోంది. కాలేజ్ లైఫ్‌లో చేసే అల్లర్లను ఈ సినిమాలో హైలైట్ చేసినట్టు తెలుస్తోంది. వృత్తిపరంగా నేటి యువత చేసే తప్పులపై ఇందులో మెసేజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఓవరాల్‌గా చూసుకుంటే, ఇందులో యువతకు కావాల్సిన కంటెంట్ పుష్కలంగా ఉంది. టీజర్‌కి తమన్ ఇచ్చిన బ్యాగ్ గ్రౌండ్ ఆద్యంత ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. లెట్స్ సీ.. టీజర్‌కి తగినట్టుగానే సినిమా ఆకట్టుకుంటుందో లేదో? ఇకపోతే, ఇందులో కథానాయికలుగా రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్‌లు నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్.