Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు దిమ్మ తిరిగిపోతోంది. వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హా ఏముందిలే నాలుగు యాప్స్ ప్రమోట్ చేస్తే లక్షల డబ్బు వస్తుంది.. ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. కానీ అవతల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయో పట్టించుకోలేదు. ఇప్పుడు కేసులు నమోదవుతుండటంతో తెలియక చేశాం క్షమించేయండి అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. మొన్న పంజాగుట్టలో 11 మంది సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది కేసులు పెడుతున్నారు.
Read Also : Cricket Legends: నాతో సెల్ఫీ కావాలా? ఆటోగ్రాఫ్ కావాలా?.. కపిల్, ధోనికి రోహిత్ ఫన్నీ ఆఫర్..
ఏకంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు కూడా రంగంలోకి దిగాడు. నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బెట్టింగ్ మహమ్మారి వల్ల వేలాది మంది సూసైడ్ చేసుకున్నారని.. వారికి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అటు ఓయూలో జనసేన విద్యార్థి విభాగం కూడా రంగంలోకి దిగింది. ఓయూ పోలీస్ స్టేషన్ లో విద్యార్థి విభాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న జబర్దస్త్ వర్ష, హర్షసాయి, నటుడు అలీ సతీమణి జుబేద, యాంకర్ లాస్యలతో పాటు మరికొందరిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.
ఇంకోవైపు సూర్యాపేట పోలీసులు బయ్యా సన్నీయాదవ్ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సూర్యాపేటలోని నూతనకల్లు పోలీస్ స్టేషన్ లో సన్నీ యాదవ్ మీద కేసు నమోదైంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేతలు, సామాజిక కార్యకర్తలు బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ లెక్కన ప్రమోట్ చేసిన వారిపై ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. చూస్తుంటే వీరు ఈ కేసుల్లో నుంచి బయటపడటం కాస్త కష్టమే అంటున్నారు నిపుణులు.