గత యేడాది మాదిరిగానే పలువురు సినీ ప్రముఖులు ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా కన్నుమూశారు. అదే సమయంలో అనారోగ్యం కారణంగానూ మరికొందరు దివికేగారు.
ప్రముఖ సినీ మాటల, పాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ (64) జనవరి 5వ తేదీ గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. 1986లో ‘శ్రీరామచంద్రుడు’తో గీత రచయితగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన వెన్నెల కంటి మూడు వందలకు పైగా చిత్రాలలో దాదాపు మూడు వేల పాటలు రాశారు.
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు జనవరి 18న అనారోగ్యంతో కన్నుమూశారు. అగ్రకథానాయకుల వందలాది చిత్రాలను సీడెడ్ లో పంపిణీ చేసిన దొరస్వామి రాజు ‘సీతారామయ్య గారి మనవరాలు, అన్నమయ్య’ వంటి చక్కని చిత్రాలు నిర్మించారు.
దక్షిణాది, హిందీ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన పి.ఎస్. నివాస్ (73) ఫిబ్రవరి 1న కొళిక్కోడ్ లో కన్నుమూశారు. మలయాళ చిత్రం ‘మోహినీయట్టం’తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయనకు ‘నిమజ్జనం’ చిత్రానికి గానూ ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా నంది అవార్డ్ వచ్చింది. పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు.
ప్రముఖ దర్శక నిర్మాత నటుడు స్వర్గీయ రాజ్ కుమార్ తనయుడు రాజీవ్ కపూర్ (58) గుండెపోటుతో ఫిబ్రవరి 9న కన్నుమూశారు. హీరోగా ‘రామ్ తేరీ గంగా మైలీ’తో గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కపూర్ ‘ప్రేమ్ గ్రంథ్’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.
ప్రముఖ రచయిత్రి సి. ఆనంద రామం ఫిబ్రవరి 11న కన్నుమూశారు. ఆమె రాసిన నవలలు ‘ఆత్మబలి’ (సంసారబంధం), ‘జాగృతి’ (త్రిశూలం), ‘మమతల కోవెల’ (జ్యోతి) సినిమాలుగా వచ్చాయి.
ప్రముఖ నిర్మాత మాగంటి బాబు కుమారుడు రామ్ చందర్ (36) అనారోగ్యంతో మార్చి 7న విజయవాడలోని ఓ హాస్పిటల్ లో మృతిచెందారు. ఆయన సుమంత్ అశ్విన్ తో ‘తూనీగ తూనీగ’ చిత్రం నిర్మించారు.
ప్రముఖ నిర్మాత, దర్శకులు కె. రాఘవేంద్రరావు అన్నయ్య కోవెలమూడి కృష్ణమోహనరావు హైదరాబాద్ లో మార్చి 24న కన్నుమూశారు. ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ లో తెలుగులోని ప్రముఖ కథానాయకులతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన పలు చిత్రాలు నిర్మించారు. తండ్రి కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలోనూ ‘సుప్రభాతం, కొత్తనీరు’ చిత్రాలు నిర్మించారు కృష్ణమోహనరావు.
క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’లో నటించిన నాగయ్య (సిరిసిల్ల రాములు) గుంటూరు జిల్లా దేచవరంలో చనిపోయారు. తొలి చిత్రంతోనే ఆయన నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకోవడం విశేషం.
ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ (59) ఏప్రిల్ 17న గుండెపోటుతో చెన్నయ్ లో చనిపోయారు. కె. బాలచందర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన ఆయన తర్వాత నటుడిగా మారారు. 300లకు పైగా చిత్రాలలో నటించిన ఆయనను 2009లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో పలు బాధ్యతలు నిర్వర్తించిన నిర్మాత చిట్టి నాగేశ్వరరావు (సి.ఎన్. రావు) ఏప్రిల్ 20న కన్నుమూశారు. ‘మా సిరిమల్లె, అమ్మ నాన్న లేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ తదితర చిత్రాలను ఆయన నిర్మించారు.
సంగీత దర్శకద్వయం నదీమ్ -శ్రావణ్ లోని శ్రావణ్ రాథోడ్ (66) ముంబైలో ఏప్రిల్ 22న చనిపోయారు. 1990లో ‘ఆషికీ’ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చిన వీరిద్దరూ ఆ తర్వాత ఎన్నో మ్యూజికల్ హిట్స్ ను ఇచ్చారు. నదీమ్ విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత సోలోగా పలు చిత్రాలకు శ్రావణ్ స్వరాలు సమకూర్చారు.
హిందీ, గుజరాతీ భాషల్లో పలు చిత్రాలలో నటించిన అమిత్ మిస్త్రీ గుండెపోటుతో ఏప్రిల్ 23న కన్నుమూశారు. ‘క్యా కెహనా, ఏక్ చాలీస్ కి లాస్ట్ లోకల్, యమ్లా పగ్లా దీవానా’ తదితర చిత్రాలలో ఆయన నటించారు.
ఏప్రిల్ 24న సీనియర్ హిందీ నటుడు లలిత్ బెహల్ (71) కరోనాతో కన్నుమూశారు. ‘తిత్లీ, ముక్తి భవన్, జడ్జిమెంటల్ హై క్యా’ తదితర చిత్రాలలో ఆయన నటించారు.
సీనియర్ తెలుగు నటుడు పొట్టి వీరయ్య (74) గుండెపోటుతో ఏప్రిల్ 25న మృతి చెందారు. 1967లో ‘అగ్గిదొర’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన వీరయ్య దాదాపు 400 చిత్రాలలో నటించారు.
ఏప్రిల్ 26న దర్శకుడు సాయి బాలాజీ కరోనాతో హైదరాబాద్ లో చనిపోయారు. ‘ఒరేయ్ తమ్ముడు, శివాజీ, జై శ్రీరామ్’ చిత్రాలను ఆయన రూపొందించారు. అదే రోజు సీనియర్ ఎడిటర్ వామన్ భోంస్లే ముంబైలో కన్నుమూశారు. 1967లో ‘దో రాస్తే’తో ఎడిటింగ్ రంగంలోకి వచ్చిన ఆయనకు ‘ఇన్ కార్’ చిత్రం నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టింది. ప్రముఖ నటి మాలాశ్రీ భర్త, నిర్మాత రాము కరోనా కారణంగా బెంగళూరులో చనిపోయారు.
ఏప్రిల్ 28న ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్ డైరెక్టర్, బుల్లితెర దర్శకుడు చంద్ర (74) కన్నుమూశారు. ‘చలిచీమలు, ఊరుమ్మడి బతుకులు, మంచుపల్లకి, డిటెక్టివ్ నారద’ వంటి చిత్రాలకు ఆయన ఆర్ట్ డైరెక్టర్.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కె. వి. ఆనంద్ (54) ఏప్రిల్ 29న గుండెపోటుతో చనిపోయారు. ‘రంగం, బ్రదర్స్, వీడొక్కడే, బందోబస్త్’ వంటి చిత్రాలను ఆయన రూపొందించారు. సీనియర్ తమిళ నటుడు ఆర్.ఎస్.జి. చెల్లాదురై (84) కన్నుమూశారు. ‘మారి, తేరి, కత్తి, శివాజీ’ తదితర చిత్రాలలో ఆయన నటించారు.
పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి, వరుణ్ సందేశ్ తో ‘ప్రియుడు’ చిత్రం రూపొందించిన శ్రవణ్ కరోనాతో ఏప్రిల్ 30న చనిపోయారు.
మే 1న ప్రముఖ బాలీవుడ్ నటుడు బిక్రమ్ జీత్ కన్వర్ పాల్ (52) కరోనాతో కన్నుమూశారు.
ఆదుర్తి సుబ్బారావుతో కలిసి ‘మాయదారి మల్లిగాడు, గాజుల క్రిష్టయ్య’ చిత్రాలను; సొంత బ్యానర్ లో ‘రక్తసంబంధం, పంచాయితీ, సిరిమల్లె నవ్వింది, మన్మథలీల కామరాజు గోల, రంభ – రాంబాబు’ చిత్రాలు నిర్మించిన ఎమ్మెస్ ప్రసాద్ (76) చెన్నయ్ లో మే 6 చనిపోయారు. ఇదే రోజున ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ మోహన్ జీ (మాదిరెడ్డి కృష్ణమోహన్ రావు), తమిళ అంథ గాయకుడు కోమగన్ (48) కన్నుమూశారు. అలానే ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు జి. ఆనంద్ (67) అనారోగ్యంతో చనిపోయారు. ‘అమెరికా అమ్మాయి’లోని ‘ఒక వేణువు వినిపించెను’ గీతం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు వనరాజ్ భాటియా (94) మే 7న వయో భారంతో కన్నుమూశారు.
‘సోగ్గాడి కాపురం, బాలరాజు బంగారు పెళ్ళాం, చెలికాడు’ చిత్రాల నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి మే 8న కన్నుమూశారు.
ప్రముఖ పాత్రికేయుడు, నటుడు టీఎన్ ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి) కరోనాతో మే 10న కన్నుమూశారు. అదే రోజున మలయాళ రచయిత, దర్శకుడు డెన్నిస్ జోసఫ్, రచయిత, నటుడు మాడంపు కుంజుకుట్టన్ కరోనాతో చనిపోయారు.
మే 11న హెచ్ఎంవీ గ్రామ్ ఫోన్ రికార్డ్స్ సంస్థ దక్షిణాది విభాగాధిపతి, నటుడు పుట్టా మంగపతి మే 11న కన్నుమూశారు.
చిరంజీవి ‘యమకింకరుడు’తో పాటు దాదాపు 30 సినిమాలు సంగీతం అందించిన కె.ఎస్. చంద్రశేఖర్ మే 12న కరోనా తో చనిపోయారు.
రచయిత, దర్శకుడు నంద్యాల రవి (42) కరోనాతో మే 14న కన్నుమూశారు. ‘నేను సీతామాలక్ష్మీ, పందెం, అసాధ్యుడు, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ చిత్రాలకు రచన చేసిన నంద్యాల రవి, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
మే 16న ప్రముఖ గీత రచయిత అదృష్ట దీపక్ (71) కరోనాతో కన్నుమూశారు. ‘నేటి భారతం’లోని మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం’ గీతం ఆయనకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది.
‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ మూవీతో బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్న గంగాధర్ కరోనాతో మే 18న చనిపోయారు. దక్షిణాది భాషలోని పలు చిత్రాలకు ఆయన మేకప్ మేన్ గా పనిచేశారు.
మే 20వ తేదీ ప్రముఖ నిర్మాత, దర్శకుడు యు. విశ్వేశ్వరరావు కన్నుమూశారు. ఎన్టీయార్ తో ‘కంచుకోట, నిలువుదోపిడి, పెత్తందార్లు’ చిత్రాలు నిర్మించిన ఆయన ‘తీర్పు, నగ్నసత్యం, హరిశ్చంద్రుడు, కీర్తి కాంత కనకం’ చిత్రాలను డైరెక్ట్ చేశారు. అదే రోజు సీనియర్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో చనిపోయారు.
మే 21 ప్రముఖ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు చనిపోయారు. ఆయన భార్య బి. జయ దర్శకత్వంలో పలు చిత్రాలు నిర్మించారు. అదే రోజు ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్ డైరెక్టర్ గోపీ కన్నుమూశారు. తెలుగు సినిమాలలో దాదాపు 200 పాటలు రాసిన నేరేడుకొమ్మ శ్రీనివాస్ కరోనాతో కాలం చేశారు.
మే 22న సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ (79) నాగపూర్ కన్నుమూశారు. రాజశ్రీ ఫిలిమ్స్ చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు.
మే 23న ప్లే బ్యాక్ సింగర్ ఏవీయన్ మూర్తి కన్నుమూశారు. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ర శ్రీనివాస మూర్తి ఈయన తనయుడు.
నటి జ్యోతి భర్త, నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ (66) విశాఖలో గుండెపోటుతో చనిపోయారు. ‘ఈ పిల్లకు పెళ్ళౌతుందా?, కలికాలం ఆడది, డామిట్ కథ అడ్డం తిరిగింది, ఈ దేశంలో ఒక రోజు, సఖియా’ చిత్రాలు నిర్మించారు.
జూన్ 2 బాలీవుడ్ నటి రింకు సింగ్ నికుంబ్ కరోనాతో, జూన్ 3న తమిళ దర్శకుడు జి.ఎన్. రంగరాజన్ అనారోగ్యంతో కన్నుమూశారు.
జూన్ 4న ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. ఆయన రాసిన యజ్ఞం నవల సినిమాగా వచ్చింది.
జూన్ 10వ తేదీ ప్రముఖ గాయకుడు ఘంటసాల తనయుడు రత్నకుమార్ కన్నుమూశారు. వెయ్యికి పైగా చిత్రాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. దాదాపు యాభై సినిమాలకు మాటలు రాశారు.
శాండిల్ వుడ్ నిర్మాత, పంపిణీదారుడు కె.సి.ఎన్. చంద్రశేఖర్ జూన్ 13న కన్నుమూశారు.
ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న సంచారి విజయ్ రోడ్డు ప్రమాదం కారణంగా వైద్యం చేయించుకుంటూ జూన్ 14న కన్నుమూశారు. ‘కిల్లింగ్ వీరప్పన్, ఉలవచారు బిర్యానీ’ చిత్రాలలో ఆయన నటించారు.
జూన్ 30న హిందీ చిత్రాల దర్శకుడు, నిర్మాత, మందిరాబేడీ భర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో కన్నుమూశారు.
జూలై 7న భారత సినీ దిగ్గజం దిలీప్ కుమార్ (98) కన్నుమూశారు. 1944లో ‘జ్వార్ భాటా’తో కెరీర్ ప్రారంభించిన ఆయన చివరి చిత్రం 1998లోని ‘ఖిలా’. కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మ విభూషణ్ తో సత్కరించింది.
రామ్ సే సోదరుల్లో ఒకరైన కుమార్ రామ్ సే (85) గుండెపోటుతో జూలై 8న చనిపోయారు. రామ్ సే సోదరులు 1970-80 మధ్య పరమితమైన బడ్జెట్ లో అపరిమితమైన హారర్ చిత్రాలు నిర్మించారు.
నటుడు, దర్శకుడు కత్తి మహేశ్ రోడ్డు యాక్సిడెంట్ కు గురై, చికిత్స పొందుతూ హాస్పిటల్ లో జూలై 10న కన్నుమూశారు. ‘జర్నలిస్ట్, పెసరట్టు, ఎగిసే తారాజువ్వలు’ చిత్రాలు ఆయన డైరెక్ట్ చేశారు.
సీనియర్ నిర్మాత, నిర్మాతల మండలి కార్యనిర్వాహక సభ్యుడు కామిని వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన తీసిన ‘దాదర్ ఎక్స్ ప్రెస్’ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
సీనియర్ హిందీ నటి సురేఖ సిక్రి (75) జూలై 16న గుండెపోటుతో కన్నుమూశారు. ‘బాలికా వథు’ సీరియల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ప్రముఖ నటీమణి జయంతి (76) బెంగళూరులో జూలై 26న చనిపోయారు. వివిధ భాషల్లో దాదాపు 350 చిత్రాలలో ఆమె నటించారు. పేకేటి రంగా వివాహం చేసుకున్న ఆమె ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ‘విజయ్’ అనే సినిమాను జయంతి డైరెక్ట్ చేశారు.
జూలై 31న నటుడు, దర్శకుడు ఇరుగు గిరిధర్ అనారోగ్యంతో కన్నుమూశారు. వినోద్ కుమార్, ఆమని, ఇంద్రజ తో ఆయన ‘శుభముహూర్తం’ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.
‘కాంచన -3’లో కీలకపాత్ర పోషించిన నటి, రష్యన్ మోడల్ అలెగ్జాండ్రా జావి గోవాలోని అద్దె అపార్ట్ మెంట్ లో ఆగస్ట్ 20న చనిపోయింది.
ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ (84) చెన్నయ్ లో సెప్టెంబర్ 21న కన్నుమూశారు. 1967లో ‘సాక్షి’ సినిమాతో పబ్లిసిటీ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన చివరి చిత్రం 2000లో వచ్చిన ‘దేవుళ్ళు’. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత అయిన ఈశ్వర్ రాసిన ‘సినిమా పోస్టర్’ పుస్తకానికి నంది అవార్డు లభించింది.
అక్టోబర్ 12వ తేదీ యువ నిర్మాత, పీఆర్వో కోనేరు మహేశ్ చనిపోయారు. ‘నా నువ్వే, 118, మిస్ ఇండియా, తిమ్మరుసు’ చిత్రాలను కోనేరు మహేశ్ నిర్మించాడు. ‘విజిల్, మాస్టర్’ చిత్రాలను తెలుగులో డబ్ చేశాడు.
క్యారెక్టర్ ఆర్టిస్టు రాజబాబు (64) అక్టోబర్ 24న అనారోగ్యంతో కన్నుమూశాడు. పలు చిత్రాలలోనే కాకుండా దాదాపు 40 సీరియల్స్ లో రాజబాబు నటించారు.
‘హార్మోన్స్’ చిత్రంతో పాటు పలు లఘు చిత్రాలు నిర్మించిన ఎన్.ఎస్. నాయక్ హైదరాబాద్ లో అక్టోబర్ 25న హఠాన్మరణం చెందారు.
అక్టోబర్ 29న కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చిన్నకుమారుడు పునీత్ రాజ్ కుమార్ (46) గుండెపోటుతో చనిపోయారు. బాలనటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పునీత్ ను కన్నడ చిత్రసీమ పవర్ స్టార్ ని పిలుచుకునేది.
‘రిక్షా రుద్రయ్య, పోలీస్, దేవా, సాంబయ్య’ తదితర చిత్రాలను రూపొందించిన కె.ఎస్. నాగేశ్వరరావు పాలకొల్లు నుండి హైదరాబాద్ వస్తూ మార్గం మధ్యలో అనారోగ్యంతో నవంబర్ 27న కన్నుమూశారు.
నవంబర్ 28న ప్రముఖ నృత్య దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. 2013లో వచ్చిన ‘బాహుబలి’ ఆయన చివరి చిత్రం. శివశంకర్ మాస్టర్ పలు చిత్రాలలోనూ నటించారు.
నవంబర్ 29న పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో కన్నుమూశారు. 1985లో ‘సిరివెన్నెల’తో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తుదిశ్వాస విడిచే వరకూ పాటలు రాస్తూనే ఉన్నారు. కొన్ని చిత్రాలలో అతిథి పాత్రలను పోషించారు.
డిసెంబర్ 2న కృష్ణాజిల్లా తాండకి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మాత జక్కుల నాగేశ్వరరావు (46) ప్రాణాలు కోల్పోయారు.