Betting Apps : బెట్టింగ్ యాప్స్ కేసులపై మియాపూర్ పోలీసులు దూకుడు పెంచుతున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు హీరో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీతలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు అటు బెట్టింగ్ యాప్స్ కంపెనీలపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 19 బెట్టింగ్ యాప్స్ కంపెనీల ఓనర్లపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. అసలు ఈ యాప్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి అడ్రస్, వివరాలను పోలీసులు ఛేదించే పనిలో పడ్డారు. ఈ యాప్స్ కంపెనీల ఓనర్లపై కొత్త సెక్షన్లు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
Read Also : Sugarcane Juice: చెరుకు రసం శరీరానికి నిజంగా మంచిదేనా?
అంతే కాకుండా యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎవరెవరు ఏయే యాప్ లను ప్రమోట్ చేశారనేది కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. రానా, ప్రకాశ్ రాజ్ లు జంగిల్ రమ్మీ యాప్ కోసం ప్రమోట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే విజయ్ దేవరకొండ ఏ 23 యాప్ కోసం, యోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి, ఫెయిర్ ప్లే లైవ్ యాప్ కోసం హీరోయిన్ ప్రణీత, జీట్ విన్ యాప్ కోసం నిధి అగర్వాల్, ఆంధ్ర 365 యాప్ కోసం శ్యామల ప్రమోషన్ చేసినట్టు పోలీసులు మెమోలో తెలిపారు. అటు పంజాగుట్టలో కేసులు నమోదైన రీతు చౌదరి, టేస్టీ తేజ, బయ్య సన్నీ యాదవ్, హర్షసాయి, విష్ణుప్రియలు పలు యాప్ లను ప్రమోట్ చేసినట్టు పోలీసులు గుర్తిస్తున్నారు. త్వరలోనే ప్రమోట్ చేసిన వారి స్టేట్ మెంట్ లు రికార్డు చేసే అవకాశాలు ఉన్నాయి.