Mithun Chakraborty: ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో ఆయనను సోమవారం డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయన కోలుకున్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మిథున్ చక్రవర్తికి కొంత రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారు. కానీ, మిథున్ చక్రవర్తి మాత్రం తనకు షూటింగ్ ఉందని, త్వరలోనే షూట్ లో పాల్గోవాలి అని చెప్పడం ఆయన పనిని ఎంత గౌరవిస్తారో తెలుస్తోంది.
ఇక తాజాగా ఆయన ఆరోగ్యం గురించి మీడియా ముందు మాట్లాడారు. ” నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉంది. నేను బాగానే ఉన్నాను. కాకపోతే కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంది. ఇకనుంచి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయదల్చుకోలేదు. ఇక రేపటి నుంచి నా పని మొదలుపెట్టాలి. నాకు షూటింగ్ ఉంది. అందులో పాల్గొనాలి. ఇకపోతే హాస్పిటల్ బెడ్ పై ఉన్నప్పుడు ప్రధాని మోదీ నాకు ఫోన్ చేసి తిట్టారు. ఆరోగ్యం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటావా అంటూ తిట్టారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ మధ్యనే ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది కేంద్రం. బాలీవుడ్‌లో 80, 90వ దశకాల్లో మిథున్ చక్రవర్తి హవా కొనసాగింది. ‘అయాం ఏ డిస్కో డ్యాన్సర్’ అంటూ ప్రేక్షకులపై చెరగని ముద్రవేశారు. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్, బెంగాలీ సినిమాల్లో హీరోగా చేశారు. 100కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన చివరిసారిగా బెంగాలీ చిత్రం ‘కాబూలీవాలా’లో నటించారు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలోనూ నటుడిగా ఆయన తన సత్తా చాటారు. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించిన ఆయన తెలుగులో ‘గోపాల గోపాల’ చిత్రంలోనూ నటించారు.