Minister Roja: సందు దొరికితే చాలు టీడీపీపై విరుచుకుపడుతూ ఉంటుంది వైసీపీ మినిస్టర్ రోజా. చంద్రబాబు, బాలకృష్ణ ల తీరును ఎండగడుతూ మీడియా ముందు ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కు మొదటి గెస్ట్ గా హాజరయ్యారు. ఇక ఈ షోలో రాజకీయ ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెప్పుకొచ్చారు చంద్రబాబు. ముఖ్యంగా 1995లో జరిగిన రాజకీయ పరిణామాలపై చంద్రబాబు వివరణ ఇవ్వడం, అందుకు బాలయ్య సైతం తాను ఆ సమయంలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ బావాబామ్మర్దుల షోపై రోజా విరుచుకుపడింది.
మీడియా ముందు ఆమె మాట్లాడుతూ “అన్ స్టాపబుల్ గా అబద్దాలు ఎంత కళ్ళార్పకుండా చెప్పారో బావాబామ్మర్దులు.. ఎన్టీఆర్ గారిని తన పదవి దాహంతో వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు అమాయకంగా.. ఆరోజు మీరు కూడా మాతో ఉన్నారు.. నేను కాళ్ళు పట్టుకొని ఏడ్చాను.. అయినా ఆయన వినలేదు.. నేను చేసింది తప్పా..? అని అడగడం ప్రజలను పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారు. పచ్చ మీడియా ద్వారా చెప్తే ప్రజలు నమ్మడంలేదని, కామెడీ షో, ఎంటర్ టైన్మెంట్ షో ద్వారా ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు.. కాదు వీళ్ళు తింగరోళ్ళు కాబట్టి ఇంకా ఏవో చెప్పి మభ్యపెట్టాలనుకుంటున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక ప్రోమో పైనే ఎన్ని కాంట్రవర్సీలు వచ్చాయో చూసారు. నా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వారికి కావాల్సింది పదవులు.. ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఎన్టీఆర్ కుటుంబాన్నే ఏ విధంగా వాడుకొని వదిలేశాడో అందరికి తెల్సిందే ” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.