మెగాస్టార్ చిరంజీవి వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘గాడ్‌ఫాడర్’ ఒకటి. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’కు ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఫస్ట్ లుక్ టీజర్‌ని విడుదల చేసింది. ఇందులో చిరు ఇచ్చే మాస్ ఎంట్రీకి రొమాలు నిక్కబొడుచుకోవాల్సిందే!
కార్యకర్తలు పార్టీ జెండాలు ఊపుతుండగా.. వారి మధ్య నుంచి బ్లాక్ కలర్ కారు దూసుకొస్తుంది. తొలుత సునీల్ దిగి డోర్ తీయగా.. చిరు స్లో మోషన్‌లో కారు దిగి నడిచొస్తారు. సరిగ్గా కారు దిగే సమయంలో తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌కి గూస్‌బంప్స్ రావాల్సిందే! రీమేక్ కాబట్టి ఒరిజినల్‌లో మోహన్‌లాల్ వేసిన గెటప్‌లోనే చిరు ఇందులో కనిపించారు. కాకపోతే ఇక్కడ చిరు నలుపు రంగు కుర్తాలో గాగుల్స్ తొడుక్కొని, స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. ఇదే సమయంలో విజయదశమి సందర్భంగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
కాగా.. సల్మాన్ ఖాన్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ ట్యాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాను కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టు కొన్ని మార్పులతో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు.