మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవం సినీ రంగానికి చెందిన అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భం విడుదల చేసి మూలవిరాట్ దర్శనం పోస్టర్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయిపోయింది. చిరంజీవి నటిస్తున్న ఈ 154వ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, వి.వి. వినాయక్, పూరి జగన్నాథ్, కొరటాల శివ, ఛార్మి, హరీశ్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చిబాబు, బీవీయస్ రవి, నాగబాబు తదితరులు హాజరయారు. కొరటాల శివ, హరీశ్ శంకర్, మెహర్ రమేశ్, బుచ్చిబాబు, శివ నిర్వాణ సినిమా స్క్రిప్ట్ ను మేకర్స్ కు అందించారు. ముహూర్తపు సన్నివేశానికి వి. వి. వినాయక్ క్లాప్ కొట్టగా, పూరి జగన్నాథ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. చిరంజీవితో పాటు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించబోతున్న ఈ చిత్రానికి జి. కె. మోహన్ సహ నిర్మాత. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ మూవీకి ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రాఫర్, నిరంజన్ దేవరమానే ఎడిటర్, ఎ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదల ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి కథ, మాటలు దర్శకుడు బాబీనే రాసుకున్నారు. స్క్రీన్ ప్లేను కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. అలానే రచయిత బృందంలో హరిమోహన్ కృష్ణ, వినీత్ పొట్లూరి సైతం ఉన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలు కాబోతోంది.