అలనాటి నాయిక మాధవి నటించిన ‘మాతృదేవో భవ’ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అప్పట్లో ప్రతి ఒక్కరూ ఆ మూవీతో కనెక్ట్ అయ్యారు, ధియేటర్ లో కన్నీరు పెట్టారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ‘మాతృదేవోభవ’ అనే టైటిల్ తోనే ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఇందులో సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ ప్లే చేశారు. ఆమె భర్తగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు. భర్త ప్రమాదంలో చనిపోవడంతో తన పిల్లలను సుధ ఏ విధంగా పెంచిందనే కంటెంట్ తీసుకొని ఎమోషనల్ ఎలిమెంట్స్ జత చేసి కె. హరనాథ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఎమ్మెస్ రెడ్డి సమర్పకుడిగా చోడవరపు వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో పతంజలి శ్రీను, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. రఘు బాబు, పోసాని కృష్ణ మురళి తో పాటు సూర్య, చమక్ చంద్ర, జెమిని సురేష్, శ్రీహర్ష, సత్యశ్రీ, సోనియా చౌదరి, కీర్తి, అపూర్వ, జబర్దస్త్ అప్పారావు ఇందులో కీలక పాత్రలు పోషించారు. కె.జె.ఎస్. రామా రెడ్డి కథను అందించిన ఈ సినిమాకు మరుధూరి రాజా మాటలు రాశారు. ‘మాతృదేవో భవ’ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత వెంకటేశ్వరరావు తెలిపారు.