Malikappuram Trailer: ఇండస్ట్రీలో ఏ మంచి సినిమా వచ్చినా అది తెలుగు ప్రేక్షకులకు అందించేవరకు అల్లు అరవింద్ నిద్రపోరు. అలానే కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అనే కాదు కొరియన్ సినిమాలను కూడా ఆహాలో డబ్బింగ్ చేసి దింపేస్తున్నారు. ఇప్పటికే అలా డబ్బింగ్ అయ్యిన చిత్రాలు ఆహాలో ఆహా అనిపిస్తున్నాయి. ఇక తాజాగా మరో హిట్ మూవీ ఆ లిస్ట్ లో చేరిపోయింది. అదే మాలికాపురం. మలయాళంలో పెద్ద హిట్ అయిన ‘మలికప్పురం’ ను తెలుగులో మాలికాపురం గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల యశోద సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూడగానే తెలుగులో అయ్యప్ప స్వామి సినిమా అనగానే గుర్తొచ్చే దేవుళ్ళు సినిమా గుర్తు రాకమానదు. అయితే ఇందులో కొద్దిగా ట్విస్ట్ ఏంటంటే.. స్త్రీలకు శభరిమల ఆలయంలో ప్రవేశం నిషేధం అనే ఒక కీలక పాయింట్ ను చూపించారు.
Social Look: కొడుకును చూసి మురిసిన కాజల్.. తుఫాన్ వచ్చేముందు కామ్ గా ఉంటుందన్న నిఖిల్
అయ్యప్ప మీద ఉన్న అపారమైన భక్తితో ఒక బాలిక శబరిమల వెళ్లాలని కోరుకుంటుంది. కానీ, ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోరు. తండ్రికి పనులు ఉన్న కారణాన ఇంట్లో ఎవరికి చెప్పకుండా అన్నతో కలిసి శబరిమల వెళ్తారు. అక్కడ వారు ఎదుర్కొనే కష్టాలు.. వారిని కాపాడడానికి అయ్యప్ప మాల వేసుకొని వచ్చిన ఉన్ని ముకుందన్.. ఆ బాలిక కోరిక తీరుస్తాడా..? అయ్యప్ప స్వామి మాల ముసుగులో కొందరు దుండగులు చేస్తున్న అఘాయిత్యాలు ఏంటి..? వారికి అయ్యప్ప బుద్దిచెప్పాడా..? అనేది సినిమా కథగా తెలుస్తోంది. దేవుళ్ళు సినిమాలో అయ్యప్పన్ స్వయంగా కిందకు వచ్చి ఇద్దరు చిన్నారుల ముడుపును తీసుకొని పైకి వెళ్తాడు. ఇక్కడ కూడా ఒక చిన్నారి కోరికను తీర్చడానికి అయ్యప్పనే స్వయంగా వచ్చి వారికి సహాయపడతాడు. దేవుళ్ళు ఎలాంటి విజయాన్ని అయితే అందుకుందో.. ఈ సినిమా కూడా అలాంటి విజయమే అందుకునేలా ఉంది. జనవరి 26 న ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సినిమాకు తెలుగువారు ఎలాంటి బ్రహ్మరధం పడతారో చూడాలి.