Unni Mukundan: కన్నడ చిత్రం ‘కాంతార’ను తెలుగులో డబ్ చేసి, విడుదల చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సెన్సేషనల్ హిట్ ను తన కిట్ లో వేసుకున్నారు. తాజాగా ఆయన మలయాళ చిత్రం ‘మాలికా పురం’ తెలుగు అనువాద హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ‘జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ, యశోద’ చిత్రాలతో తెలుగు వారికి సుపరిచితుడైన ఉన్ని ముకుందన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా శబరిమల యాత్ర చుట్టూ సాగుతుంది. పల్లెటూరిలో ఉండే ఎనిమిదేళ్ళ పాప టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న శబరిమలకు వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని అనుకుంటుంది. కానీ కుటుంబంలో చోటుచేసుకున్న కొన్ని విషాదకర సంఘటనలతో ఆ పాప ప్రయాణం వాయిదా పడుతుంది. ఎట్టకేలకు తన స్నేహితులు కొందరి తోడు తీసుకుని శబరిమలకు బైలుదేరి ఈ పాపకు మార్గం మధ్యలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నదే ‘మాలికా పురం’ కథ.
గత యేడాది డిసెంబర్ 30న మలయాళంలో విడుదలైన ‘మాలికా పురం’ను డివోషనల్ హిట్ అంటూ అక్కడి మీడియా ఆకాశానికి ఎత్తుతోంది. ఇటీవల శబరిమల ప్రవేశం వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఓ చిన్నారి బాలిక అక్కడకు వెళ్ళడం, మార్గం మధ్యలో ఆమెకు దైవానుగ్రహం లభించడం, సివిల్ పోలీస్ ఆఫీసర్ అయిన అయ్యపన్ ఆమెకు సాయం చేయడం ఇవన్నీ… రోమాంచితంగా దర్శకుడు విష్ణు శశి శంకర్ తెరకెక్కించాడని అంటున్నారు. ఈ సినిమా చూస్తున్న జనం థియేటర్లలో ‘స్వామియే శరణమయ్యప్పా’ అంటూ నినదిస్తున్నట్టు వార్తలూ వస్తున్నాయి. ‘కాంతార’ వంటి సూపర్ హిట్ డివోషనల్ మూవీని తెలుగు వారికి అందించిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత అల్లు అరవింద్ ‘మాలికా పురం’ హక్కుల్ని తీసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘మాలికా పురం’ చిత్రాన్ని నెల 21న రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అల్లు అరవింద్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.