కర్నూలులో జరిగిన సర్కారు వారి పాట సక్సెస్ మీట్‌లో భాగంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు వేదికపై తొలిసారి స్టెప్పులేసి, ఆ ప్రాంగణాన్ని హుషారెత్తించారు. ఆ తర్వాత ప్రసంగిస్తూ.. తనకోసం తరలివచ్చిన మీ (ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ) కోసమే తాను మొదటిసారి స్టేజ్‌పై డ్యాన్స్ చేశానని అన్నారు. అప్పుడెప్పుడో ఒక్కడు షూట్ కోసం కర్నూల్ వచ్చానని, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత సర్కారు వారి పాట సక్సెస్ మీట్ కోసం వచ్చిన తనని చూసేందుకు ఇంతమంది అభిమానులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీ (ఫ్యాన్స్) అభిమానం, ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు.
ఇక ఈ సినిమాని తన కుటుంబ సభ్యులతో కలిసి తొలిసారి చూశానని.. సినిమా చూసిన అనంతరం తనయుడు గట్టిగా వాటేసుకున్నాడని, అమ్మాయి సితార అయితే ‘నీ అన్ని సినిమాల్లో కన్నా ఇందులో బాగా చేశావు, అందంగా కనిపించావు’ అని చెప్పిందని మహేశ్ అన్నారు. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు పరశురామ్‌దేనని కొనియాడారు. సర్కారు వారి పాట క్యారెక్టరైజేషన్ తనకు బాగా నచ్చిందని, మీరిచ్చిన ఈ సక్సెస్ ఎప్పుడూ గుర్తుండిపోతుందని తెలిపారు. తన ఫేవరేట్ మూమెంట్ లవ్ ట్రాక్ అని, అది తనకు విపరీతంగా నచ్చిందన్నారు.
తన తండ్రి కృష్ణ సినిమా చూశాక.. ఇది పోకిరి, దూకుడు కన్నా పెద్ద హిట్ అవుతుందన్నారన్నారని.. అందుకు చాలా హ్యాపీగా ఉన్నానని మహేశ్ తెలిపారు. కరోనా వల్ల ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని, ఇప్పుడు మీరిచ్చిన సక్సెస్‌తో తమకు చాలా స్పెషల్ అని అన్నారు. సర్కారు వారి పాట తనకిచ్చినందుకు మైత్రీ మూవీ మేకర్స్ వారికి థాంక్స్ చెప్తున్నానని మహేశ్ బాబు చెప్పుకొచ్చారు.