మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండటంతో ఈసారి ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా నటి హేమకు ‘మా’ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాక ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నటి హేమ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.
కాగా, ‘మా’ వివాదాలపై మెగాస్టార్ చిరంజీవి సైతం రీసెంట్ గా స్పందించారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని, ‘మా’ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని చిరంజీవి ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజును కోరారు. వీలైనంత తొందరగా ఎన్నికలు పెట్టాలని ఆయనకు లేఖ రాశారు. ఈసారి ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు.