మనసు బాగోలేనప్పుడు, ఏం ఎందుకు బాగోదు!? అలా అనుకున్నా, ఆందోళన చెందిన మనసుకే తెలుసు అది ఎలా ఉందో? అర్థం పర్థం లేకుండానే మనం అయోమయంలో ఉన్నప్పుడు మన మనసు కాసింత సేద తీరాలంటే ఏదో ఒక ఉత్సాహం మనల్ని పలకరించాలి. అది మధురంగా ఉంటే మరింత బాగుంటుంది. అలా ఆలోచించేవాళ్ళు మధురగాయని ఎస్.జానకి గళంలో జాలువారిన పాటలను వింటారు. ఆ పాట హుషారయినదా? బాధాతప్తమైనదా? అనీ ఆలోచించలేం. జానకమ్మ పాట వింటే చాలు ఆ గళమాధుర్యం మనల్ని ఉత్సాహానికి గురి చేస్తుంది. ఇలాంటి స్థితి తెలుగు సంగీతాభిమానులందరికీ అనుభవమే! మన తెలుగు పాటనే కాదు, మన జానకమ్మ గాత్రంలో చిందులు వేసిన పరభాషాగీతాలు సైతం పరమానందం పంచుతూనే ఉంటాయి. ఆ గళమాహాత్మ్యాన్ని ఎంత తలచుకుంటే అంత ఆనందం మన సొంతమవుతుంది.
గుంటూరు జిల్లా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జానకమ్మ కన్నుతెరిచారు. చిన్నప్పటి నుంచీ అందరినీ తన మధురగాత్రంతో సమ్మోహితులను చేస్తూ వచ్చారు జానకి. ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే జానకి తొలుత పాడిన సినిమా పాట మాత్రం విషాద గీతం కావడం చిత్రం! తెలుగునాట పుట్టి, మాతృభాష తెలుగే అయినా, జానకి తొలుత తమిళ పాట పాడవలసి వచ్చింది. ఏవీయమ్ స్టూడియోస్ లో ఆమె స్టాఫ్ సింగర్ గా ఉన్నారు. ఆ సమయంలో తెలుగు సంగీత దర్శకులు టి.చలపతిరావు స్వరకల్పనలో రూపొందిన తమిళ చిత్రం ‘విధియిన్ విలయాట్టు’లో జానకి మొట్టమొదట పాడారు. తరువాత తెలుగులో ఆమె ‘యమ్.ఎల్.ఏ’ చిత్రంలో “నీ ఆశా అడియాస… నీ దారే మణిపూస… బ్రతుకంతా అమవాసా… లంబాడోళ్ళ రామదాసా…” అనే పాట పాడారు. ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. ఇలా విషాద గీతాలతో ఆరంభమైన జానకి గానప్రయాణం ఏ ఆటంకమూ లేకుండా యాభై ఏళ్ళ పాటు సజావుగా సాగింది. సదా నవ్వుతూ, నవ్విస్తూనే ఐదు తరాల తారలకు పాటలు పాడి ఆకట్టుకున్నారామె.
జానకి పాట ఎంతోమంది భావి నటీమణులు నటజీవితానికి బాటలు వేసింది. ఆమె నేపథ్యగానంతో ఎందరో తారామణులు తెరపై రాజ్యమేలారు. కొందరు ఆమెను ద్వితీయశ్రేణి గాయనీ అన్నారు. అయినా, తన మధురం పంచుతూనే తానేమిటో నిరూపించుకున్నారు. ఏ భాషలో పాడినా, ఏ మాత్రం తొట్రు పడకుండా సహజత్వం ఉట్టిపడేలా జానకి గానం సాగింది. అందుకే తెలుగువారే కాదు, దక్షిణాది మొత్తం, జానకి పాటకు సలామ్ చేశారు. పలువురు సంగీత దర్శకులు జానకమ్మ పాటలతో ప్రేక్షకులను పరవశింపచేశారు. ఇళయరాజా బాణీల్లో జానకమ్మ పాడిన అనేక పాటలు జనం మదిని దోచాయి.
అనేక భాషల్లో కలిపి దాదాపు యాభై వేల పాటలు పాడిన జానకి, ఉత్తమ గాయనిగా పలు పురస్కారాలు అందుకున్నారు. ఇంతలా తన గానంతో అలరించిన జానకమ్మ ఆ మధ్య ’96’ అనే తమిళ చిత్రంలో తెరపై కనిపించారు. ఆమె సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘మౌనపోరాటం’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. 2013లో కేంద్రప్రభుత్వం జానకిని ‘పద్మభూషణ్’ అవార్డుతో గౌరవించాలని భావించింది. అయితే ఆ అవార్డు తనకు రావడం పట్ల ఆమె ఏ మాత్రం సంతోషించలేదు. అప్పటికే చాలా ఆలస్యమైందని భావించారు. ఏ మాత్రం మొహమాట పడకుండా ‘పద్మభూషణ్’ అవార్డును తిరస్కరించారామె. ఆమె నిర్ణయానికి అభిమానులు ఎంతగానో సంతోషించారు. ఎందుకంటే జానకి వంటి మేటి గాయనీమణికి అన్నేళ్ళకు ‘పద్మ’ అవార్డు ప్రకటించడమే విడ్డూరమని ఫ్యాన్స్ భావించారు. ఆమె స్థాయికి తగ్గ అవార్డు ఒకే ఒక ‘భారత రత్న’ అని చాలామంది అభిప్రాయపడ్డారు. జానకి కూడా తన స్థాయికి తగ్గ అవార్డు ‘భారతరత్న’ ఒక్కటేనని నిర్మొహమాటంగా చెప్పారు. అభిమానుల అభిమానాన్ని మించిన అవార్డు లేదని భావిస్తున్న జానకమ్మ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం!