ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ప్రేమకథాచిత్రం ‘లవ్వాట’. ఈ చిత్రాన్ని ఎన్. వెంకటేశ్వర్లు, బొట్టా శంకర్రావు, వెంకటగిరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ‘రావణలంక’ ఫేమ్ క్రిష్ బండిపల్లి హీరో. మీరా కన్నన్, దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రంలో బెనర్జీ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. జూన్ 22 నుంచి, శ్రీకాకుళం, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ జరిగింది. సోషల్ మీడియాలో నిర్వహించిన కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన మానే రామారావు ఈ టైటిల్ లోగో లాంఛ్ చేశారు. ‘లవ్వాట’లో తానొక కీలక పాత్ర పోషిస్తున్నానని, దర్శకుడిగా గాంధీకి ఉజ్వల భవిష్యత్ ఉందని బెనర్జీ తెలిపారు.
అటు దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ.. ‘నా తొలి చిత్రం ‘ప్రేమభిక్ష’ విడుదల కాకుండానే మూడో చిత్రం ‘లవ్వాట’ ప్రీ-ప్రొడక్షన్ పూర్తి చేసుకుని టైటిల్ లాంఛ్ జరుపుకోవడం ఆనందంగా ఉంది. నా మొదటి, రెండో చిత్రాలు ‘ప్రేమభిక్ష, రుద్రాక్షపురం’ పోస్ట్ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రేమ పట్ల నేటితరం దృక్పథం ఏమిటన్నది వినోదాత్మకంగా వివరిస్తూ సాగే చిత్రమిది. తెలుగుతో పాటు తమిళ-కన్నడ భాషల్లో రూపొందిస్తున్నాం’ అన్నారు. థ్రిల్లర్ మంజు, ఢిల్లీ మురళి, అప్పాజీ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.