Vishwak Sen: ఇటీవల సీనియర్ హీరో అర్జున్ సర్జా తను నిర్మిస్తూ దర్శకత్వం వహించనున్న చిత్రం నుండి హీరో విశ్వక్ సేన్ ని తొలిగించినట్లు మీడియా ద్వారా ప్రకటించాడు. దీనిపి పలు చర్చలు జరుగుతున్నాయి. విశ్వక్ సిన్సియారిటీని ప్రశ్నిస్తూ వృత్తి పట్ల విశ్వక్ కి డెడికేషన్ లేదని చెప్పాడు. ఆ తర్వాత స్క్రిప్ట్ లో తను సూచించిన మార్పులను దర్శకుడు అంగీకరించడానికి సిద్ధంగా లేనప్పుడు తాను పని చేయలేనని విశ్వక్ చెబుతూ అర్జున్ కి క్షమాపణ కూడా చెప్పాడు. వాస్తవానికి తన దుందుడుకు స్వభావానికి విరుద్ధంగా ఎంతో వినయంగా చెప్పినా మొత్తం ఇష్యూ తనకు ప్రతికూలంగా మారుతుందేమోనని విశ్వక్ సేన్ ఆందోళన చెందుతున్నాడు.
ఇప్పటికే ఓ వైపు వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి.
‘హిట్’ తర్వాత సరైన హిట్ లేదు. ‘పాగల్, అశోకవనంఓ అర్జున కళ్యాణం, ఇటీవల వచ్చిన ఓరి దేవుడా’ సినిమాలు విశ్వక్ ను బాగా నిరాశ పరిచాయి. ఇప్పటికే తన ఆటిట్యూడ్ తో చిత్రపరిశ్రమలో విశ్వక్ పై కొంత వరకూ నెగెటివిటీ నెలకొని ఉంది. దానికి తోడు అర్జున్ సినిమా నుంచి బయటకు వెళ్ళవలసి రావటం నిజంగా విశ్వక్ సేన్ కి నష్టం కలిగించే అంశమే. అందుకే తన ఆశలన్ని తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమ్కీ’ పైనే పెట్టుకున్నాడు విశ్వక్ సేన్. ఈ వివాదం నుంచి బయటపడటానికి ‘ధమ్కీ’ టీజర్ ని రెడీ చేస్తున్నాడట. నిజానికి ఈ ‘ధమ్కీ’కి కూడా ముందు వేరే దర్శకుడు దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనో ఏమో ఆ యువ దర్శకుడు తప్పుకోవడంతో విశ్వక్ సేన్ దర్శకత్వ బాధ్యతలతో పాటు నిర్మాణాన్ని కూడా తలకెత్తుకున్నాడు. టీజర్ దాదాపు సిద్ధమై ప్రస్తుతం ఫైనల్ సౌండ్ డిజైన్ వర్క్ జరుపుకుంటోందని అంటున్నారు. ఈ టీజర్ బయటకు వస్తే తన ఫ్యాన్స్ దృష్టి దానిపైకి వెళుతుందని కొంత వరకైనా వివాదాన్ని మరచిపోతారని భావిస్తున్నాడట విశ్వక్. మరి విశ్వక్ అనుకున్నట్లు ‘ధమ్కీ’ టీజర్ అర్జున్ వివాదం నుంచి బయటపడేలా చేస్తుందేమో చూద్దాం.