డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శనకర్ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా జోష్ తో విజయ్ దేవరకొండతో లైగర్ ని మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అని క్యాప్షన్ పెట్టి మరింత ఆసక్తి పెంచారు పూరి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి- ఛార్మీ కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాడు. ఇక దీంతో ఈ సినిమాకు ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. సినిమా రిలీజ్ కాకముందే ఈ టీమ్ కి బాలీవుడ్ స్పెషల్ స్టేటస్ వచ్చేసింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ లో కథను కొద్దిగా రివీల్ చేశాడు పూరి .. ఒక ఆవారా గా తిరిగే కుర్రాడు బాక్సర్ గా ఎలా మారాడు. దేశానికి ఎలా పేరుతెచ్చాడు అనేది క్లుప్తంగా చూపించాడు. అయితే ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెసింగ్ వార్త ప్రస్తుతం వైరల్ గా మారడంతో పాటు సినిమాపై పలు అనుమానాలను కూడా తెస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ నటిస్తున్న సంగతి తెల్సిందే.
ఇప్పటివరకు మైక్ , విజయ్ కి కోచ్ గా కనిపించనున్నాడని టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాలో విజయ్ తండ్రిగా మైక్ టైసన్ కనిపించనున్నాడట. ఇండియన్ మదర్.. విదేశీ ఫాదర్ కి జన్మించినవాడిగా విజయ్ క్యారెక్టర్ ఉండనున్నదట. అందుకే సాలా క్రాస్ బ్రీడ్ అని క్యాప్షన్ పెట్టారట పూరి. తల్లితండ్రుల మధ్య గొడవ.. తల్లితో హీరో పెరగడం, తల్లి చనిపోయాక తండ్రి వద్దకు వెళ్లడం.. తండ్రి బాక్సింగ్ కోచ్ గా మారి కొడుకును ఛాంపియన్ గా నిలబెట్టడం.. ఆగండాగండి ఇదంతా ఎప్పుడో చూసిన సినిమాలా అనిపిస్తుంది కదా .. అవును ఈ సినిమా అచ్చు గుద్దినట్లు పూరి డైరెక్ట్ చేసిన `అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి` సినిమాలనే ఉంది. ఆ సినిమా రీమేక్ లానే ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారా..? ఏంటి అని ఫ్యాన్స్ కి అనుమానం వస్తుంది. మరి పూరి పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఆయన తీసిన సినిమానే మళ్లీ రీమేక్ చేయడం లేదు కదా.. అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.