మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రాబోతోంది. ‘కురుప్’ అనేది 1984 ఇండియాస్ లాంగ్ వాంటెడ్ ఫ్యుజిటివ్ సుకుమార కురుప్ జీవితంపై రూపొందుతున్నకథ. ఇప్పటికీ ఆయన జాడ లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక కానిస్టేబుల్ టెలిఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కురుప్‌ను పట్టుకోవడానికి తన ఉన్నత అధికారి కృష్ణదాస్ భోపాల్‌కు వెళ్లినట్లు అతను అవతలి వ్యక్తికి చెబుతాడు. డయలర్ స్వయంగా కురుప్ కావడంతో కానిస్టేబుల్ పూర్తిగా షాక్‌కి గురవుతాడు. ట్రైలర్ పూర్తిగా వన్ మ్యాన్ షో. పలు రూపాలలో కన్పిస్తున్న దుల్కర్ పరారీలో ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు పోలీసులు, ఇతర ఏజెన్సీల నుండి తప్పించుకుంటున్నాడు. మరోవైపు ఆయన పోలీస్ గానూ కన్పిస్తుండడం ఆసక్తికరంగా మారింది. శోభితా ధూళిపాళ దుల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు ఆసక్తికరంగా ఉండగా, సుశిన్ శ్యామ్ సంగీతం విజువల్స్‌ను హైలెట్ చేసింది. ‘కురుప్’తో దుల్కర్ పాన్-ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 12న ఐదు భాషలలో విడుదల కానుంది.
Read Also : ఒకే రోజు మహేశ్ బాబు రెండు సినిమాల ప్రకటనలు!