దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నూరవ చిత్రం ఏది? అనగానే ‘గంగోత్రి’ అంటూ చప్పున సమాధానం చెప్పేస్తారు. నిజానికి దర్శకేంద్రుని వందో సినిమాగా తెరకెక్కాల్సింది వేరే ఉందట! తన నూరవ చిత్రం చరిత్రలో తరిగిపోని, చెరిగిపోని రికార్డులు నెలకొల్పాలని ఓ భారీ మల్టీస్టారర్ తీయాలని ఆయన ఆశించారు. అప్పటికే ‘నరసింహనాయుడు, ఇంద్ర’ వంటి బ్లాక్ బస్టర్స్ కు కథను సమకూర్చిన చిన్నికృష్ణను పిలిపించి రాఘవేంద్రరావు ఓ మల్టీస్టారర్ తయారు చేయమన్నారట! అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ఉండేలా కథ రూపొందించారు. ఇక ‘త్రివేణి సంగమం’ పేరుతో ఆ సినిమాను పట్టాలెక్కించాలి అనుకుంటున్న సమయంలో రాఘవేంద్రరావు కు అత్యంత సన్నిహితులు, ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ వచ్చి ‘మల్టీస్టారర్’ అంటే రిస్క్ అని, హీరోల ఫ్యాన్స్ మధ్య అభిప్రాయభేదాలు పెంచినవారమవుతామని చెప్పారట. దాంతో రాఘవేంద్రరావు కూడా అది నిజమే కదా అని ఆ ప్రయత్నం మానుకున్నారట! తరువాత ఓ చిన్న సినిమా కథ రాసిపెట్టమంటే ‘గంగోత్రి’ రాశారట చిన్నికృష్ణ. దర్శకేంద్రుని నూరవ సినిమాగా వచ్చిన ‘గంగోత్రి’ ద్వారానే అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు. నేడు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా సాగుతున్నాడు.
అది అలా ఉంచితే, అసలు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చిరు, నాగ్, వెంకీనే దర్శకేంద్రుడు ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు? చిరంజీవిని తొలి నుంచీ రాఘవేంద్రరావు ప్రోత్సహిస్తున్నారు. ‘మోసగాడు, తిరుగులేని మనిషి’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటింప చేశారు. ‘ఖైదీ’తో స్టార్ అయిన చిరంజీవికి తన ‘అడవిదొంగ’తో మరింత స్టార్ డమ్ సంపాదించి పెట్టారు. ఆ తరువాత కూడా చిరుతో దర్శకేంద్రుడు అనేక హిట్స్ తీశారు. ఇక నాగార్జునకు ‘అన్నమయ్య’తో తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసిందీ ఆయనే. వెంకటేశ్ ను హీరోగా ‘కలియుగ పాండవులు’తో పరిచయం చేసింది కూడా దర్శకేంద్రుడే! ఇలా ఈ ముగ్గురితోనూ చెరిగిపోని చరిత్ర ఉంది కనుకే వారిని ఎంచుకున్నారు దర్శకేంద్రుడు. మరి బాలకృష్ణ, మోహన్ బాబుతోనూ దర్శకేంద్రుడు సినిమాలు తీశారు కదా! వారు లేకుండా, కేవలం ఈ ముగ్గురే తనకు కావలసిన వారని రాఘవేంద్రరావు భావించారా? అదే అయితే, ఆ ఇద్దరు హీరోలతోనూ చిక్కు వచ్చేదే! ఏమయితేనేమి, ఆ మల్టీస్టారర్ పట్టాలెక్కకుండా అశ్వనీదత్ ఆపారు. ఆ విధంగా ఏ వివాదానికీ తావివ్వకుండా దర్శకేంద్రుడు తప్పించుకున్నారు.