Kriti Sanon Reacts On Adipurush Backlas And Delay: ఆదిపురుష్ టీజర్‌పై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే! వీఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉందని, దీని కంటే బొమ్మల సినిమాలే బాగుంటాయంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదండోయ్.. హిందూ సంఘాలు సైతం ఈ టీజర్ పట్ల మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాముడు, హనుమంతుడు, రావణుల పాత్రల్ని ఈ టీజర్‌లో చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీజేపీ నేతలతో పాటు కొందరు పేరుగాంచిన స్వామీజీలు కూడా ఫైర్ అయ్యారు. దాదాపు వారం రోజుల పాటు ఈ టీజర్‌పై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం మరింత బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో.. ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే.. యూనిట్ సభ్యులెవ్వరూ ఈ సినిమా గురించి పెదవి విప్పింది లేదు.
తాజాగా ఆదిపురుష్ టీజర్‌పై వచ్చిన విమర్శలతో పాటు ఈ సినిమాని వాయిదా వేయడంపై కృతి సనన్ స్పందించింది. వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన భేడియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదిపురుష్ గురించి ప్రశ్నలు ఎదురవ్వగా.. అమ్మడు తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. టీజర్ నిడివి చాలా చిన్నదని.. కేవలం దాన్ని చూసి సినిమాని ఎలా జడ్జ్ చేస్తారని గట్టిగా బదులిచ్చింది. ఆదిపురుష్ సినిమా పట్ల తమకు చాలా గర్వంగా ఉందని, ఇది మన చరిత్రలో భాగమని తెలిపింది. ఇదొక గొప్ప సినిమా అని, మనమంతా గర్వించదగ్గ కథ అని పేర్కొంది. ఈ సినిమాను సాధ్యమైనంత ఉత్తమంగా అందించేందుకు దర్శకుడు ఓమ్ రౌత్ కష్టపడుతున్నారని స్పష్టం చేసింది. దర్శకుడు ఇంతకుముందే ఒక ప్రెస్‌నోట్‌లో చెప్పినట్లు.. ఈ సినిమాపై మరింత పని చేయాల్సిన అవసరం ఉందని, అందుకు సమయం పడుతుందని కృతి సనన్ చెప్పుకొచ్చింది.
కాగా.. ఆదిపురుష్ సినిమాను తొలుత సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే.. టీజర్‌కి తీవ్ర వ్యతిరేకత రావడంతో, మరింత ఉన్నతమైన గ్రాఫిక్స్ అందించాలన్న ఉద్దేశంతో చిత్రబృందం ఆ పనిలో నిమగ్నమైంది. బెస్ట్ ఔట్‌పుట్ అందించాలంటే, కచ్ఛితంగా సమయం పడుతుంది కాబట్టి.. ఈ సినిమాను జూన్ 16కి వాయిదా వేశారు.