దక్షిణాదిన సినిమాలను ప్యాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రూపొందించటంలో దర్శకనిర్మాతలు నిమగ్నమై ఉన్నారు. ‘బాహుబలి’, ‘కెజిఎఫ్’ సీరీస్ ఘన విజయంతో అందరి దృష్టి దక్షిణాది సినిమాలపై పడిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ సినిమాలు పరాజయాల బాట పడటంతో పాటు మన సినిమాలకు అపూర్వ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో దర్శకులు కూడా భిన్నమైన కాంబినేషన్స్ కు ట్రై చేస్తున్నారు. ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కలసి నటించటం… దానికి అన్ని చోట్లా చక్కటి ఆదరణ లభించటం… మణిరత్నం రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ కి మార్కెట్ లో చక్కటి హైప్ రావటంతో పలు కాంబినేషన్స్ తో సినిమాలకు ట్రై చేస్తున్నారు దర్శకనిర్మాతలు.
తమిళనాట స్టార్ హీరోలు విజయ్, అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ నెక్ టు నెక్ కొనసాగుతూ ఉంటుంది. అలాంటిది వీరిద్దరినీ కలిపి సినిమా తీస్తే.. అలాంటి మల్టీ స్టారర్ పడితే ఆ హైప్ ఎలా ఉంటుందో కూడా ఊహించలేము. ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ ని కలిపి సినిమా చెయ్యాలని ఉందంటూ దర్శకుడు వెంకట్ ప్రభు ప్రకటించాడు. అంతే కాదు వారిద్దరికీ సరిపడా స్క్రిప్ట్ కూడా సిద్ధఃగా ఉందని ఓ కాలేజ్ వేడుకలో పాల్గొన్న వెంకట్ ప్రభు ఎనౌన్స్ చేశాడు. అంతే ఈ న్యూస్ తమిళ సినీ వర్గాల్లో క్యూరియాసిటీని కలిగించింది. నిజానికి రీసెంట్ గా వెంకట్ ప్రభు నాగచైతన్యతో బై లాంగువల్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. త్వరలో అది పట్టాలెక్కనుంది. ఇప్పుడు విజయ్, అజిత్ కి సరిపడే కథ ఉందంటూ సంచలనం రేపాటు. తమిళనాట విజయ్, అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. ఎంతో మంచి స్నేహితులైన ఎన్టీఆర్, చరణ్ కలసి ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తేనే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ వార్ జరిగింది. మరి అదే విజయ్, అజిత్ మల్టీస్టారర్ అయితే ఇక చెప్పనక్కరలేదు. యుద్ధాలే జరుగుతాయి. ఈ నేపథ్యంలో విజయ్, అజిత్ కలసి నటిస్తారా? దానిని వారి ఫ్యాన్స్ ఎంత వరకూ అంగీకరిస్తారు? వెంకట్ ప్రభు తన కథతో ఈ స్టార్ హీరోలిద్దరినీ మెప్పించగలడా? వీటన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి.