గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మహరాజా రవితేజ ‘క్రాక్’ మూవీ యాభై శాతం ఆక్యుపెన్సీలో సైతం చక్కని విజయాన్ని అందుకుంది. అతని అభిమానులతో పాటు నిర్మాతల్లోనూ కొత్త ఆశలు రేపింది. దాంతో రవితేజతో సినిమాలు తీసేందుకు నిర్మాతలంతా క్యూ కట్టారు. ఇప్పుడు ఏకంగా ఐదారు సినిమాలు వరుసగా తెరకెక్కుతున్నాయి. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే… గత యేడాది విడుదల కావాల్సిన రవితేజ ‘ఖిలాడి’ మూవీని దర్శకుడు రమేశ్ వర్మ, నిర్మాత కోనేరు సత్యనారాయణ ఫిబ్రవరి 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ హాట్ కేక్ లా జరిగిందని దర్శకుడు రమేశ్ వర్మ కొద్ది సేపటి క్రితమే ట్వీట్ చేశారు. ట్రేడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం నైజాంలోని తొమ్మిది కోట్లు, సీడెడ్ లో 3.6 కోట్లు, ఆంధ్రాలో 11 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట. ఇక హిందీలో ఈ సినిమాను నిర్మాణ భాగస్వామి పెన్ మూవీస్ విడుదల చేయబోతోంది. ఈ థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓవర్ ఆల్ గా ఇండియాలోనూ, ఓవర్సీస్ లోనూ ఎంత బిజినెస్ జరిగిందో తెలియాలి. ఇక దానికి ఓటీటీ, శాటిలైట్స్ అమ్మకాలు అదనం! మొత్తానికి ‘ఖిలాడి’ మూవీ విడుదల సమయానికి సూపర్ క్రేజ్ సంపాదించుకుందనే చెప్పాలి.