మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. ఆ సినిమా తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని అందుకోలేదు. అయినా సరే బాక్సాఫీస్ మీద యుద్ధం చేస్తూ విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇక తాజాగా కీర్తి సురేష్ ‘సాని కాయిదమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు ధనుష్ అన్న సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని ధనుష్ రిలీజ్ చేశాడు. ఇక ఈ చిత్రం తెలుగులో చిన్ని పేరుతో విడుదల కానుంది.
పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న ఒక మహిళ గా కీర్తి సురేష్ కనిపించింది. ” ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటి? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. మనమూ తిరిగి విసరాలి. మన మీద ఉమ్మేస్తే.. మనమూ ఉమ్మేయాలి. మనల్ని కొడితే మనమూ కొట్టాలి.” అంటూ కీర్తి ఆవేశంగా చెప్తూ ఉంటే మధ్యలో సెల్వ రాఘవన్ విజువల్స్ చూపించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రంలో కీర్తి కి సవతి సోదరుడిగా సెల్వ రాఘవన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. చిన్ని అనే మహిళ తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? దీనికి ఆమె సవతి సోదరుడు ఏవిధంగా తోడుగా నిలిచాడు? అనేది కథగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతోనైనా కీర్తి విజయ ఢంకా మోగించి బ్యాక్ టూ ఫార్మ్ లోకి వస్తుందేమో చూడాలి.