యువ కథానాయకుడు అదిత్ అరుణ్ తన పేరును ఇటీవలే త్రిగుణ్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్జీవీ ‘కొండా’ తో పాటు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘కథ కంచికి మనం ఇంటికి’. ఈ హారర్ కామెడీ మూవీలో పూజిత పొన్నాడ అతనితో జోడీ కడుతోంది. మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్ట్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. త్రిగుణ్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హారర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుని, ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది.
సప్తగిరి కామెడీ ట్రాక్ సైతం ఆకట్టుకుంది. ‘సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంద’ని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కథ కంచికి మనం ఇంటికి’ మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వైయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ మంజ్రేకర్, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.