Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ మరో వివాదంలో చిక్కున్నాడు. అతనిపై కెంగేరి పోలీస్ స్టేషన్ లో నిర్మాత ఫిర్యాదు చేశాడు. తనను దర్శన్ తో పాటు మరొక నటుడు బెదిరిస్తున్నారంటూ సదురు నిర్మాత వాపోయాడు. వివరాల్లోకి వెళితే.. కన్నడ సినీ నిర్మాత భరత్ విష్ణుకాంత్ ‘భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ధృవన్ అనే నటుడు నటిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కరోనా రావడంతో సినిమా ఆగిపోయింది. నిర్మాత భరత్ తన వద్ద డబ్బులేదని, ఈ సినిమాను నిర్మించే అవకాశం లేదని ధృవన్ కు చెప్పాడు. అంతేకాకుండా ఒకవేళ డబ్బు సర్దుబాటు అయితే వెంటనే షూటింగ్ ను మొదలుపెడతామని కూడా చెప్పుకొచ్చాడు. అయితే తన సినిమాను నిలిపివేస్తున్నట్లు అనుకోని ధృవన్, దర్శన్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఇక దర్శన్, నిర్మాతకు ఫోన్ చేసి సినిమా పూర్తి చేయడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలుంటాయని, వెంటనే సినిమాను పూర్తిచేయాలని బెదిరించాడు. దీంతో భయపడిన నిర్మాత భరత్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పిటిషన్ తో పాటు దర్శన్ మాట్లాడిన ఆడియో క్లిప్ ను పోలీసులకు అందజేశాడు. ఇక ఆ ఆడియో క్లిప్ లో దర్శన్, నిర్మాతను బెదిరించడం క్లియర్ గ వినిపిస్తోంది. నేను తలుచుకుంటే కనపడకుండా పోతావ్, వెంటనే సినిమా పూర్తి చెయ్.. నేను ఏదైనా చెప్పే చేస్తా.. రెడీగా ఉండు, ఎక్కడా కనిపించకుండా చేస్తా” అంటూ దర్శన్ బెదిరించడం, లాక్‌డౌన్ తర్వాత సినిమాను ప్రారంభిస్తానని ఆడియోలో నిర్మాత చెప్పుకురావడం వినిపిస్తోంది. ఇక ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది.