కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. కరోనాతో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం చికిత్స జరుగుతుండగానే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రదీప్ రాజ్ గత 15 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారని, దాంతో పాటు ఈ కరోనా కూడా రావడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్సకు ఆయన అవయవాలు సహకరించలేదని తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు
ఇకపోతే ఆయన కన్నడలో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. కెజిఎఫ్ హీరో యష్ తో కలిసి ‘కిచ్చా’, ‘కిరాతక’ అనే సినిమాలను తెరక్కించారు. ఈ సినిమాలు యష్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆయనకు కరోనా రాకముందు యష్ తో కిరాతక 2 తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఈ విధంగా జరగడం బాధాకరమని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.