కంగనా రనౌత్ పేరు వినగానే అభిమానుల మదిలో వీణలు మోగేవి. ఆమె అందాల అభినయాన్ని వెండితెరపై చూడాలని జనం పరుగులు తీసేవారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న నటిగా కంగనా రనౌత్ పలుమార్లు రికార్డ్ సృష్టించారు. ఆమె నంబర్ వన్ హీరోయిన్ గా వెలుగులు విరజిమ్మడం అభిమానులకు ఆనందం పంచింది. కానీ, కొద్ది రోజులుగా కంగనా రనౌత్ ఓ పక్షానికే కొమ్ముకాస్తున్నారనీ నెటిజన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు. నెపోటిజమ్ పై విరుచుకుపడే కంగనా రనౌత్ కు జనం ఆరంభంలో బాసటగా నిలిచారు. కానీ, గత సంవత్సరం కంగనా రనౌత్ నటించిన ‘ధాకడ్’ సినిమా ఫలితం చూశాక, ఆమెలో మునిపటి మ్యాజిక్ లేదనిపిస్తోంది. ‘ధాకడ్’ చిత్రం పెట్టుబడిలో కనీసం మూడోశాతం రాబడి చూడలేకపోయింది. ఇది చూసి బాలీవుడ్ జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. “క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్, మణికర్ణిక” చిత్రాలతో మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి, జనం మదిని గెలిచిన కంగనా చిత్రం కనీసం పెట్టుబడిలో పదోశాతం వసూళ్ళు కూడా చూడక పోవడంతో అభిమానులు విచారిస్తున్నారు. కొందరు అమ్మాయిగారి పని అయిపోయిందనీ చంకలు గుద్దుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా కంగనా రనౌత్ అలరించబోతున్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం కంగనా సక్సెస్ గ్రాఫ్ మళ్ళీ పైకి లేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కంగనా ప్రధాన పాత్ర పోషించిన ‘తేజాస్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు ముస్తాబవుతోంది. అవ్ నీత్ కౌర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ జంటగా ‘టికూ వెడ్స్ షేరు’ చిత్రాన్ని నిర్మించారు కంగనా రనౌత్. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ‘చంద్రముఖి-2’ తమిళ చిత్రంలోనూ కంగనా నటిస్తున్నారు. ఇక బీజేపీ పార్టీ నీడలో సాగుతోన్న కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, నిర్మాత, దర్శకత్వం బాధ్యతలు కూడా కంగనా నిర్వహిస్తూ ఉండడం విశేషం. ఇందులో 1976 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సరైన సమయంలో జనం ముందుకు తీసుకు రావాలన్నది కంగనా భావన. మరి ఏ రాష్ట్ర ఎన్నికల సమయాన ‘ఎమర్జెన్సీ’ వెలుగు చూస్తుందో?
రాబోయే కంగనా రనౌత్ చిత్రాలలో ‘ఎమర్జెన్సీ’ నటిగా తనకు ఓ ఛాలెంజ్ అని ఆమె అన్నారు. అంతేకాదు, ఆమె దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కుతూఉండడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి కలుగుతోంది. మొత్తానికి ఇందిరా కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభమైన నాటి ప్రధాని ఇందిరాగాంధీని ఇందులో నెగటివ్ షేడ్స్ లోనే చూపిస్తారని జనం అంటున్నారు. ఇందిర గెటప్ లో ఇప్పటికే కంగనా రనౌత్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు. మరి, తనదైన అభినయంతో ఆమె ఏ తీరున ‘ఎమర్జెన్సీ’లో అలరిస్తారో చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కంగన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తూ తెరకెక్కిస్తోన్న ‘ఎమర్జెన్సీ’ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.