(మార్చి 22తో ‘కంచుకోట’కు 55 ఏళ్ళు పూర్తి)
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నటరత్న యన్.టి.రామారావు అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించి అలరించారు. ఆయన నటించిన అనేక జానపదాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పంపిణీదారులకు, ప్రదర్శనశాలల వారికి యన్టీఆర్ జానపద చిత్రాలే కామధేనువుగా నిలిచాయి. ఆ రోజుల్లో ఏ థియేటర్ లోనైనా సినిమా లేకపోతే, వెంటనే యన్టీఆర్ జానపద చిత్రం వేసుకొనేవారు. సదరు చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొనేవి. రిపీట్ రన్ లోనూ ఓ జానపద చిత్రం వంద రోజులు మూడు ఆటలతో ఆడడం అంటే అప్పట్లోనే కాదు, ఇప్పటికీ అద్భుతం అనిపిస్తుంది. అలాంటి చరిత్ర సృష్టించిన చిత్రం యన్టీఆర్ నటించిన ‘కంచుకోట’. 1967 మార్చి 22న విడుదలైన ఈ జానపద చిత్రం అప్పటికి వెలుగు చూసిన ఇతర జానపదాలకన్నా భిన్నంగా రూపొంది విశేషాదరణ చూరగొంది. శతదినోత్సవాలు చేసుకుంది. 1975లో ‘కంచుకోట’ హైదరాబాద్ లో మూడు ఆటలతో శతదినోత్సవం జరుపుకోవడం ఈ నాటికీ విశేషంగా ముచ్చటించుకుంటారు.
‘కంచుకోట’ కథ విషయానికి వస్తే – చంద్రగిరి ప్రాంతాన్ని దోపిడీ దొంగలు దోచుకుంటారు. ఆ ఊరివాడయిన సురేంద్రుడు ఆ సమయంలో వేరే చోట ఉంటాడు. విషయం తెలుసుకొని, ఈ అఘాయిత్యాన్ని రాజు దృష్టికి తీసుకువెళ్ళాలని కోటకు వెళతాడు. అక్కడ ఎవరూ కనిపించరు. మార్గమధ్యంలో వస్తూ ఉండగా, రాకుమారుడు నరేంద్రుని రక్షిస్తాడు. దాంతో వారిద్దరూ మంచి మిత్రులు అవుతారు. ఇక అడవిలోని జయంతికి, కోటలోని మంత్రి భైరవుని కూతురు మాధవికి మంచి స్నేహం ఉంటుంది. వారిద్దరూ ప్రాణస్నేహితురాళ్ళు. సురేంద్రకు ఓ సమయాన జయంతితో పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. అతణ్ణి ఓ ముసుగు మనిషి వెంబడిస్తాడు. నరేంద్ర తన మిత్రుడు సురేంద్రను తీసుకు వెళ్ళి రాజకోటలో మంచి కొలువు ఇప్పిస్తాడు. సురేంద్రను చూసిన మాధవి తొలి చూపులోనే మనసు పారేసుకుంటుంది. మాధవిని ఆమె బావ అయిన నరేంద్ర ప్రాణప్రదంగా ప్రేమిస్తుంటాడు. తన పుట్టినరోజున జయంతిని కోటకు ఆహ్వానిస్తుంది మాధవి. అదే సమయంలో తాను ప్రేమించిన సురేంద్రను చూపిస్తుంది. జయంతిని కోటలో చూసిన సురేంద్ర ఆశ్చర్యపోతాడు. జయంతి బాధతో అక్కడ నుండి పారిపోతుంది. ఇక ముసుగుమనిషి ఓ సారి నరేంద్రను చంపాలని చూస్తాడు. మళ్ళీ అతని బారి నుండి సురేంద్ర రక్షిస్తాడు. ఆ సమయంలో నరేంద్రను కోటకు చేర్చమని మిత్రుడు భజగోవిందానికి చెబుతాడు. తాను ముసుగుమనిషిని వెంటాడుతాడు సురేంద్ర. ఓ గుహలో ముసుగు మనిషిని అడ్డగిస్తాడు. అప్పుడు అతను తన గతాన్ని చెబుతాడు. అతడు ఓ నాటి భల్లాణ సామ్రాజ్యాధినేత రాజేంద్ర భూపతి తమ్ముడు విజయేంద్ర భూపతి అని తెలుస్తుంది. అతని సొంత బావమరిది భైరవుని కారణంగానే, తన అన్న ప్రాణాలు పోగొట్టుకున్నారని చెబుతాడు. తనకు అవిటి తనం ప్రాప్తించిందనీ అంటాడు. సురేంద్ర తల్లి ఓ నాటి మహారాణి రాజేశ్వరీదేవి అని, సురేంద్రనే భల్లాణ రాజ్యానికి ఉత్తరాధికారి అనీ వివరిస్తాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సురేంద్ర తన కన్నతండ్రిని అంతమొందించిన భైరవుణ్ణి, అతనికి వంతపాడిన మార్తాండను రూపు మాపాలని వెళతాడు. కానీ, అప్పటికీ సురేంద్రను అపార్థం చేసుకున్న నరేంద్ర అతనిపై కత్తి దూస్తాడు. వారి పోరాటం తన వల్లనే అని భావించిన మాధవి ఆత్మహత్య చేసుకుంటుంది. వారిద్దరినీ మంచి మిత్రులుగా ఉండాలని ఆశించి కన్నుమూస్తుంది. తన కూతురు చనిపోయిందని తెలిసి భైరవుడు పిచ్చివాడు అవుతాడు. భైరవుడే మార్తాండునీ చంపేస్తాడు. చివరకు వారి అనుచరులను సురేంద్ర, నరేంద్ర అంతమొందిస్తారు. సురేంద్ర, జయంతి వివాహం, వారి పట్టాభిషేకంతోనూ కథ సుఖాంతమవుతుంది.
సురేంద్రగా యన్టీఆర్, నరేంద్రగా కాంతారావు, మాధవిగా సావిత్రి, జయంతిగా దేవిక నటించిన ఈ చిత్రంలో శాంతకుమారి, వాణిశ్రీ, పద్మనాభం, చిత్తూరు నాగయ్య, ధూళిపాల, ప్రభాకర్ రెడ్డి, రాజనాల, రమణారెడ్డి, చదలవాడ, సత్యనారాయణ, కాంచన, ఎల్.విజయలక్ష్మి, జయశ్రీ, టి.జి.కమలాదేవి, నెల్లూరు కాంతారావు, జగ్గారావు నటించారు.
ఈ చిత్రానికి కథ, మాటలు త్రిపురనేని మహారథి సమకూర్చారు. ఈ సినిమాకు కేవీ మహదేవన్ స్వరకల్పన ఓ ఎస్సెట్. ఇందులోని పాటలను సి.నారాయణ రెడ్డి, దాశరథి, కొసరాజు, ఆచార్య ఆత్రేయ, మహారథి పలికించారు. ఈ సినిమాలోని అన్ని పాటలూ ఒక ఎత్తు, “సరిలేరు నీకెవ్వరూ…” అంటూ సాగే పాట ఒక్కటీ ఓ ఎత్తు అని చెప్పవచ్చు. మిగిలిన పాటలు “ఉలికి ఉలికి పడుతోంది…”, “సిగ్గెందుకే చెలీ…”, “లేదు లేదని ఎందుకు నీలో…”, “నీ పుట్టినరోజు…”, “ఈడొచ్చిన పిల్లనోయ్…”, “భమ్ భమ్ భజగోవిందం…”, “అర్దరేతిరి కాడ…” అంటూ సాగే పాటలూ ఆకట్టుకున్నాయి. “ఎచటనో గల స్వర్గంబు…” అనే పద్యం ఘంటసాల గళంలో జాలువారి ఎంతగానో మురిపించింది. 1967 మార్చి 22న విడుదలైన సమయంలో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. 1975లో హైదరాబాద్ లో వంద రోజలు ఆడిన సమయంలోనూ బాలనగర్ శోభన థియేటర్ లో శతదినోత్సవం చేసుకుంది. అలా ఓ జానపద చిత్రం రెండు సార్లు శతదినోత్సవం జరుపుకోవడం అన్నది ఇప్పటి దాకా మళ్ళీ జరగలేదు.
‘కంచుకోట’ చిత్రం అప్పట్లో వస్తోన్న రామారావు జానపద చిత్రాలకు భిన్నంగా తెరకెక్కింది. ఓ జానపద చిత్రం స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో రూపొందడం కూడా ఆకట్టుకుంది. ఆ తరువాత ఈ సినిమాను అనుకరిస్తూ అనేక జానపద సినిమాలు రూపొందాయి.