నవంబర్ 22న కరోనా సోకి శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ శనివారం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తెలియచేస్తూ, తాను త్వరగా కోలుకోవాలని మనసారా ఆకాంక్షించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ కు, ఇతర రాజకీయ నాయకులకు, అలానే ప్రముఖ నటుడు రజనీకాంత్ తో పాటు చిత్రసీమకు చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తనకు చక్కని వైద్యాన్ని అందించిన శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ వైద్యబృందానికి కమల్ హాసన్ కృతజ్ఞతలు చెప్పారు. అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు సైతం కమల్ ధన్యవాదాలు తెలిపారు. అలానే తన ‘విక్రమ్’ చిత్ర బృందానికి, ‘బిగ్ బాగ్’ టీమ్ కు తన పరోక్షంలో సైతం చురుకైన పాత్ర పోషించినందుకు కమల్ హాసన్ అభినందనలు తెలియచేశారు. వెంటనే తన కార్యక్రమాలను మొదలు పెడతానని ఆయన చెప్పారు.