Kalki2898AD: ఇండస్ట్రీలో లీకుల బెడద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా మొదలవ్వడం ఆలస్యం.. ఆ సినిమా ఫినిష్ అయ్యేవరకు ఏదో విధంగా ఆ సినిమాకు సంబంధించిన లీక్ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంటుంది. హీరో లుక్, సెట్ లో హీరోయిన్.. సాంగ్ బిట్.. ఇలా ఏదైనా కూడా లీక్.. లీకే. దీనివలన చూసేవారికి ఆనందం కలగవచ్చు కానీ, మేకర్స్ కు ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఒక స్టార్ హీరో ఈ సినిమాలో ఎలాంటి లుక్ తో రాబోతున్నాడో అని అభిమానులు అతడి కోసం మొదటిరోజు.. మొదటి షోకు టికెట్ కొనుక్కొని వచ్చి.. వెండితెరపై ఆ లుక్ చుస్తే అతడు ఫీల్ అయ్యే ఆ ఫీల్ ను ఈ లీకులు పోగొడుతున్నాయి. ఈ లీకుల ద్వారా.. మొదటి నుంచే హీరో లుక్ బాలేదు.. సినిమాకు వెళ్లడం వేస్ట్ అనేలా అభిమానుల మనసులను ఈ లీకులు పాడుచేస్తున్నాయి. ఇక ఈ లీకులను ఆపడానికి మేకర్స్ ఎంతో పకడ్బందీగా ప్రయత్నాలు చేస్తున్నా.. యూనిట్ లో ఉన్నవారే అత్యుత్సాహంతో వాటిని బయటపెట్టి సినిమాను నష్టాలపాలు చేస్తున్నారు.
ఇక తాజాగా ప్రభాస్ సినిమాకు కూడా ఈ లీకుల బెడద తప్పలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం కల్కి2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది. యూనిట్ లోని ఒక ముఖ్య సభ్యుడు ఆ ఫోటోను సోషల్ మీడియా ద్వారా లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదలుపెట్టి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఎలాంటి లీక్ లేకుండా నాగ్ అశ్విన్ ఎంతో జాగ్రత్త పడ్డాడు. కానీ, చివరికి ఇలా లీక్ అయ్యింది. ఇక దీనిపై మేకర్స్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. లీక్ చేసిన వ్యక్తిపై లీగల్ చర్యలు తీసుకోనున్నారని సమాచారం. ఇకపోతే ఫోటో లీక్ అవ్వగానే అందరికి స్ప్రెడ్ అవ్వకముందే మేకర్స్ డిలీట్ చేయించినట్లు తెలుస్తోంది.