Cinematography (Amendment) Act : సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952ను సవరిస్తూ, కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ (సవరణ) చట్టం 2023ను తీసుకు రాబోతోంది. దానికి సంబంధించిన బిల్లును బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. రాబోయే పార్లమెంట్ సమావేశాలలో దీనిని ప్రవేశ పెట్టడమే తరువాయి. అయితే గతంలో ఈ చట్టం విషయంలో పలువురు సినీ ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మరీ ముఖ్యంగా ఆన్ లైన్ ద్వారా జరుగుతున్న వీడియో పైరసీపై ఈ చట్టం ద్వారా కేంద్రం ఉక్కుపాదం మోపబోతోంది. దాంతో నిర్మాతలతో పాటు పలు నిర్మాణ సంస్థలు దీనికి మద్దతు ప్రకటించాయి. ఒకసారి సెన్సార్ అయిన సినిమాల వల్ల ఏదైనా వివాదాలు చెలరేగినా, ఏ వర్గమైన అభ్యంతరం వ్యక్తం చేసినా, కేంద్రం రీ-సెన్సారింగ్ కు ఆదేశించే ఆస్కారం ఈ సవరణ చట్టంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు దీన్ని బాహాటంగా గతంలో విమర్శించారు. ఇలా అయితే… సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు ఏం గౌరవం ఉంటుందని వ్యాఖ్యానించారు. సి.బి.ఎఫ్.సి.ని స్వతంత్ర స్థంస్థగా ఉంచాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం తన కనుసన్నలలో మెలిగేలా చేస్తోందని ఆరోపించారు. అందులో సభ్యులను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తోందని, ఆ రకంగా అధికార పార్టీ ఆలోచనలకు, భావాలకు తగ్గట్టుగానే వారు ప్రవర్తిస్తారని విమర్శించారు. అయితే… అందులో పూర్తి స్థాయి నిజం లేదనే విషయం ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో రుజువైంది. కేంద్రంలోని అధికార పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా తెరకెక్కిన అనేక చిత్రాలు గడిచిన కొన్నేళ్ళుగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, థియేటర్లలో ప్రదర్శితమౌతున్నాయి. నిజంగా సెన్సార్ సభ్యులు కేంద్రం కనుసన్నలలో పనిచేస్తూ ఉంటే… ఆ సినిమాలేవీ విడుదల అయ్యేవే కాదు. గతంలో పోల్చితే… ఇప్పుడు సి.బి.ఎఫ్.సి. చాలా ఉదారంగా ఉందని ప్రశంసిస్తున్న వాళ్ళూ లేకపోలేదు.
ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతున్న చట్టంలో ఫిల్మ్ సర్టిఫికేషన్ లోనూ పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకూ యు, యు/ఎ, ఎ, ఎస్ సర్టిఫికెట్స్ ను సి.బి.ఎఫ్.సి. జారీచేస్తోంది. అయితే కొంతకాలంగా యు/ఎ సర్టిఫికెట్ విషయంలో మరింత స్పష్టత ఉండాలని పలువురు కోరుతున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా, ఇతర దేశాలలో ఉన్న సెన్సార్ విధానాలను పరిశీలించి, కేంద్రం యు/ఎ సర్టిఫికెట్ ను మూడు కేటగిరిలుగా చేసింది. దాని ద్వారా యు/ఎ 7 ప్లస్, యు/ఎ 12 ప్లస్, యు/ఎ 16 ప్లస్ గా విభజిస్తున్నారు. దీనివల్ల థియేటర్లకు వచ్చే పిల్లలు తమ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ను క్యారీ చేయాలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా దీనికంటే కూడా పైరసీ మీద కేంద్ర ఉక్కుపాదం మోపడాన్ని అజయ్ దేవ్ గన్, మాధవన్, ఉన్ని ముకుందన్ తదితరులు అభినందిస్తున్నారు. అలానే స్రవంతి మూవీస్, ఎస్వీ సీసీ, టీ సీరిస్, సీవీఆర్ పిక్చర్స్ వంటి సంస్థలూ ఈ సవరణ చట్టాన్ని స్వాగతిస్తున్నాయి.