ప్రముఖ గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ జావేద్ అక్తర్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన ఓ టీవీ ఛానెల్ చర్చా ఘోష్ఠిలో చేసిన వ్యాఖ్యల కారణంగా కోర్టు కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. థానే లోని కోర్టులో ఒకరు జావేద్ అక్తర్ పై పరువు నష్టం దావా వేశారు. విషయం ఏమంటే… ఆ మధ్య ఓ న్యూస్ టీవీ ఛానెల్ చర్చలో జావేద్ అక్తర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)ను తాలిబన్ల తో పోల్చుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘తాలిబన్లు ఇస్తామిక్ దేశాన్ని కోరుకుంటున్నారని, అలానే ఇక్కడి వారు హిందూ రాష్ట్రను ఏర్పాటు చేయాలని భావిస్తున్నార’ని జావేద్ అక్తర్ అన్నారు. దీనిపై థానేలోని ఆర్. ఎస్.ఎస్. కార్యకర్త వివేక్ చంపానేర్కర్ అడిషనల్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. ఆర్.ఎస్.ఎస్. కు పరువు నష్టం కలిగించిన జావేద్ అక్తర్ ఒక రూపాయి పరిహారం ఇవ్వాలని కోరాడు. వివేక్ తరఫును కోర్టులో లాయర్ ఆదిత్య మిశ్ర తన వాదనను వినిపించారు. ‘అనాగరికమైన తాలిబన్లను, హిందూ ధర్మానికి సేవ చేసే ఆర్.ఎస్.ఎస్. ను ఒకే గాటన కట్టడం దారుణమని, కోట్లాదిమంది అభిమానాన్ని పొందిన ఆ సంస్థను జావేద్ అక్తర్ ఉద్దేశ్యపూర్వంగా కించపరిచారని తన వాదనలో పేర్కొన్నారు. అనంతరం కోర్టు జావేద్ అక్తర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే… 76 సంవత్సరాల జావేద్ అక్తర్ చేసిన కామెంట్స్ పై అనుపమ్ ఖేర్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. ”జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు నాకు నవ్వు తెప్పించాయి. ఇలా మాట్లాడటం వల్ల జావేద్ సాబ్ కు ఆనందం కలిగితే… అననీయండీ! కానీ ఒకటి మాత్రం గుర్తుంచు కోవాలి… ఎవరు ఏమి మాట్లాడినా చెల్లుబాటు అయ్యే అద్భుత ప్రజాస్వామ దేశంలో మనం ఉన్నాం” అని అనుపమ్ ఖేర్ అన్నారు.