విఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తాజా చిత్రం ‘అవతార్-2’ డిసెంబర్ 16న జనం ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘అవతార్’ చిత్రం 2009లో తొలిసారి జనం ముందు నిలచి, ఆ యేడాది టాప్ గ్రాసర్ గా నిలవడమే కాదు, ఈ నాటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రాలలో నంబర్ వన్ గా చెక్కుచెదరకుండా ఉంది. ‘అవతార్’ సినిమాతోనే ప్రపంచ వ్యాప్తంగా 3డి ఫార్మాట్ కు విశేషమైన క్రేజ్ లభించిందని, అంతకు ముందు, ఆ తరువాత ఎన్ని 3డి మూవీస్ వచ్చినా, ఆ స్థాయిలో వసూళ్ళు చూసిన చిత్రం ఏదీ లేదని సినీ పండిట్స్ చెబుతున్నారు. ‘అవతార్’ కురిపించిన కలెక్షన్ల వర్షంలో 18.2 శాతం 3డి ద్వారానే లభించిందని తెలుస్తోంది. ఆపై ఐదేళ్ళలో తరువాత వచ్చిన త్రీడీ మూవీస్ అన్నీ కలిపి 10.8 శాతం రాబడి చూశాయట. ఆ తరువాత నాలుగేళ్ళకు ఆ రాబడి 4.5 శాతానికి, మరో రెండేళ్ళకు 1.2 శాతానికి తగ్గాయి.
‘అవతార్-2’ ట్రైలర్ ను మే 6న విడుదలైన ‘డాక్టర్ స్ట్రేంజ్-2’ సినిమాతో పాటు ప్రదర్శించారు. కేవలం ‘అవతార్-2’ ట్రైలర్ ను చూడాలన్న ఆసక్తితోనే జనం ‘డాక్టర్ స్ట్రేంజ్-2’కు పరుగులు తీశారు. ఈ సినిమా 3డిలోనే రూపొందింది. అందువల్ల ఆ ఫార్మాట్ లో ప్రదర్శించిన థియేటర్లలో ‘అవతార్-2’ ట్రైలర్ నూ త్రీడీలోనే చూపించారు. జనం కిర్రెక్కి పోయారు. కొన్ని నిమిషాల పాటు చూసిన ‘అవతార్-2’ ట్రైలర్ తో థ్రిల్ ఫీలయిన జనం, ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితిని చూసి ట్రేడ్ పండిట్స్ మళ్ళీ 3డికి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఒకప్పుడు త్రీడీ ఫార్మాట్ కు విపరీతమైన క్రేజ్ తెచ్చిన చిత్రంగా ‘అవతార్’ నిలచింది. ఇప్పుడు ‘అవతార్-2’ కారణంగా 3డి మరింతగా వెలిగిపోతుందేమో చూడాలని ఆశిస్తున్నారు.