'ఇష్క్'… అంటే 'ప్రేమ'! సినిమాపై 'ఇష్క్'తో చిత్రసీమలో అడుగుపెట్టే వారంతా ప్రేక్షకుల ప్రేమను పొందాలనే ఆశిస్తారు. అందం, చందం అన్నీ ఉన్నా, అభినయకౌశలం పుష్కలంగా ఉన్నా చిత్రసీమలో రాణించాలంటే కావలసింది ఆవగింజంత అదృష్టం అంటూ ఉంటారు. అందాల హీరోగా పేరు సంపాదించిన నితిన్ కెరీర్ తో అదృష్టం దోబూచులాడుతున్న సమయంలో అతనికి ఆనందం పంచే విజయాన్ని అందించిన చిత్రం 'ఇష్క్'. నితిన్ కెరీర్ ను 'ఇష్క్'కు ముందు, తరువాత అని విభజించవచ్చు. ఎందుకంటే ఆరంభంలోనే అదరహో అనే విజయాలు చూసిన నితిన్ తరువాత పరాజయాలతోనే పలు సంవత్సరాలు ప్రయాణం చేశాడు. ఆ సమయంలో 'ఇష్క్' ఊరట నిచ్చింది. ఆ తరువాత నితిన్ ను మంచి విజయాలే పలకరించడం విశేషం. 'ఇష్క్' జనం ముందు నిలచి, అక్షరాలా పదేళ్ళు పూర్తవుతున్నాయి. 2012 ఫిబ్రవరి 24న 'ఇష్క్' విడుదలై విజయం సాధించింది.
‘ఇష్క్’ కథ విషయానికి వస్తే – శివ గాయాలపాలై ఆసుపత్రిలో చేరతాడు. అతని తండ్రి వాడి చెడు తిరుగుళ్ళ వల్లే ఇలా అయ్యాడని అంటాడు. కానీ, శివకు ఆ పరిస్థితి రావడానికి కారణం అతను దివ్య అనే అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. మూడేళ్ళ తరువాత కథలోకి రాహుల్ వస్తాడు. అతను చాలా సరదాగా ఉంటాడు. రాహుల్ కు ప్రియ పరిచయమవుతుంది. అనుకోని పరిస్థితుల్లో వారిద్దరూ కలసి ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆ సమయంలో కొన్ని పరిస్థితుల కారణంగా రాహుల్ తో అతని స్నేహితుని పెళ్ళికి ప్రియ కూడా వెళ్ళవలసి వస్తుంది. అక్కడ పెళ్ళికొడుకు తల్లి జయ, ప్రియను ఎంతో బాగా చూసుకుంటుంది. సముద్రతీరంలో ప్రియపై కొందరు దుండగులు వెంటపడితే, వారికి దేహశుద్ధి చేస్తాడు రాహుల్. తరువాత వారిద్దరూ కలసి తమ ఊరికి చేరతారు.
ఎయిర్ పోర్ట్ లో ప్రియ దగ్గరకు ఆమె అన్నయ్య వస్తాడు. అతను శివ. అతణ్ణి చూడగానే రాహుల్ కు గతం గుర్తుకు వస్తుంది. రాహుల్ అక్క దివ్యను ప్రేమించమని వెంట పడుతూ ఉంటాడు శివ. అతనికి రాహుల్ దేహశుద్ధి చేస్తాడు. అప్పుడే ఆసుపత్రిలో చేరతాడు. రాహుల్, ప్రియ ప్రేమించుకుంటున్నారన్న విషయం శివకు తెలుస్తుంది. ఎలాగైనా, వారి ప్రేమ ఫలించరాదని పలు పాట్లు పడుతూ ఉంటాడు శివ. చివరకు ప్రియ కన్నవారి అభిమానం కూడా పొందుతాడు రాహుల్. దాంతో శివ, కాలా అనే గూండాతో రాహుల్ ను మట్టు పెట్టాలని చూస్తాడు. కాలా తమ్ముడే ఒకప్పుడు తన గ్యాంగ్ తో ప్రియపై అత్యాచారం చేయబోయి ఉంటాడు. అది ప్రియ ద్వారా తెలుసుకున్న శివ అతడిపై దాడి చేస్తాడు. అయితే గూండాలు శివను హింసిస్తారు. ఇది ప్రియ ద్వారా తెలుసుకున్న రాహుల్ వచ్చి, శివను రక్షిస్తాడు. తన చెల్లెలిపై రాహుల్ కు ఉన్నది నిజమైన ప్రేమ అని తెలుసుకుంటాడు శివ. చివరకు రాహుల్, ప్రియ ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.
రాహుల్ గా నితిన్, ప్రియగా నిత్యమీనన్, శివగా అజయ్ నటించిన ఈ చిత్రంలో సింధు తులాని, రోహిణి, నాగినీడు, సుధ, అలీ, శ్రీనివాస రెడ్డి, సుప్రీత్, రవి ప్రకాశ్, తాగుబోతు రమేశ్, రత్న శేఖర్ రెడ్డి, సత్య క్రిష్ణన్ నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం విక్రమ్ కుమార్ నిర్వహించారు. ఆర్. సామల మాటలు రాశారు. ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్ కలసి నిర్మించారు. ఇందులో రెండు పాటలకు అరవింద్- శంకర్ సంగీతం సమకూర్చగా, మిగిలిన పాటలకు, సినిమాకు అనూప్ రూబెన్స్ స్వరకల్పన చేశారు. “ఓ ప్రియా ప్రియా…”, “సూటిగా చూడకు…”, “చిన్నదాన నీ కోసం…”, “లచ్చమ్మా…” అంటూ సాగే పాటలు అలరించాయి.
‘ఇష్క్’ మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ముందు నితిన్ హీరోగా అనేక చిత్రాలలో నటించినా, అతనికి “జయం, దిల్, సై” వంటి హిట్స్ మాత్రమే ఉన్నాయి. దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత ‘ఇష్క్’తో నితిన్ కు కోరుకున్న విజయం దక్కింది. ఈ చిత్రం తరువాత వచ్చిన “గుండె జారి గల్లంతయ్యిందే…” సినిమా సైతం సక్సెస్ రూటులో సాగింది. ‘ఇష్క్’ వచ్చిన నాలుగేళ్ళకు నితిన్ కెరీర్ బెస్ట్ హిట్ గా ‘అ…ఆ’ చిత్రం నిలచింది. ఆ పై’భీష్మ’, ‘రంగ్ దే’ కూడా నితిన్ కు ఆనందం పంచాయి. అలా ‘ఇష్క్’ తరువాతనే నితిన్ కు మళ్ళీ విజయ యాత్ర మొదలయిందని చెప్పవచ్చు.