Kadgam: ఖడ్గం.. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఒక భారతీయుడిగా గర్వించదగ్గ సినిమా.. ప్రతి భారతీయుడితో దేశభక్తిని నిద్రలేపి.. జెండా చూడగానే చేయి ఎట్టి సెల్యూట్ చేసేలా చేసిన సినిమా. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో ఏళ్లు.. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సంపూర్ణంగా జరుపుకున్నామంటే అది టీవీలో ఖడ్గం సినిమ చూశాకే అని ప్రజలు చెప్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికీ 20 ఏళ్ళు పూర్తి చేసుకొంది. ఇక ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకున్నదో అంతకంటే ఎక్కువ విమర్శలను అందుకొంది.. బెదిరింపులను కూడా చవిచూసింది. డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ హీరోలుగా నటించగా కిమ్ శర్మ, సంగీత, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.
హిందూ, ముస్లీమ్ భాయ్ భాయ్ అనుకోని ఇండియా మొత్తం సంతోషంగా ఉన్న సమయంలో పాకిస్థాన్ టెర్రరిస్టులు వారి ఐకమత్యాన్ని పోగొట్టడానికి కుట్ర చేయడం, ఆ కుట్రను హీరోలు ముగ్గురు నాశనం చేయడంతో సినిమా ముగుస్తోంది. అప్పట్లో ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఖడ్గం రిలీజ్ అయిన వెంటనే డైరెక్టర్ కృష్ణవంశీకి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ఆపేయాలని, లేకపోతే ఇందులో నటించినవారితో సహా తనను కూడా చంపేస్తామని బెదిరించారని కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. ఇక ఆ భయంతో తాను కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయానని, హీరో శ్రీకాంత్ అప్పట్లో జేబులో గన్ పెట్టుకొని తిరిగారని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎంత బెదిరించినా తాము తల ఒగ్గలేదని కృష్ణవంశీ గర్వంగా చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఇప్పటికి ఇండియాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా ఖడ్గం సాంగ్.. మేమే ఇండియన్స్ లేకుండా ఉండదు.