Suryadevara Naga Vamsi: ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘బలగం’. దీనికి ముందు ఇదే బ్యానర్ లో ‘దిల్’ రాజు వారసులు హన్సిత, హర్షిత్ రెడ్డి ‘ఏటీఎం’ అనే వెబ్ సీరిస్ తీశారు. శుక్రవారం ‘బలగం’ థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూస్ ను తెలంగాణాలోని రెండు ప్రధాన పట్టణాల్లో ప్రదర్శించారు. అలానే మీడియాకు స్పెషల్ షోస్ వేశారు. అందరూ ముక్తకంఠంతో ఈ సినిమా సూపర్ గా ఉందంటూ కితాబిచ్చారు.
తెలంగాణలోని సిరిసిల్ల పట్టణంలో జరిగిన కథను బేస్ చేసుకుని కమెడియన్ వేణు ‘బలగం’ సినిమాను తెరకెక్కించాడు. ఓ కుటుంబ పెద్ద మరణించిన తర్వాత అతని ఆత్మశాంతి కోసం ఇంటిల్లిపాది, బంధుగణం ఏం చేశారన్నదే ఈ చిత్ర సారాంశం. వినోదంతో పాటు చక్కని సందేశాన్ని, మానవీయ విలువలను ఈ సినిమా ద్వారా తెలియచేయడంతో అందరి మన్ననలను ‘బలగం’ చిత్రం, ఆ చిత్ర బృందం పొందుతోంది.
ఈ ముచ్చట ఇలా ఉంటే… ఇలాంటి ఓ కథతోనే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొన్ని నెలల క్రితం ‘ఇంటింటి రామాయణం’ సినిమాను నిర్మించాడు. నరేశ్, రాహుల్ రామకృష్ణ, నవ్యసామి, గంగవ్య, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ సినిమా కథ కరీంనగర్ లో జరుగుతుంది. రాములు అనే కుటుంబ పెద్ద ఇంట్లో ఊహించిన విధంగా ఓ దొంగతనం జరుగుతుంది. దానికి ఎవరు కారకులో తెలియక మొత్తం ఇంట్లోని వ్యక్తుల్ని, బంధువులను కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది. చివరకు నగ దొరికి కథ సుఖాంతమౌతుంది. అయితే అయినవారిని అనవసరంగా అనుమానించానే అని రాములు తెగ మధన పడతాడు. ఈ సినిమా కూడా మానవ సంబంధాల మీద తెరకెక్కిందే. దీని ద్వారా సురేశ్ నారెడ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఈ మూవీని మొదట డిసెంబర్ 16న ఆహాలో స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల అలా జరగలేదు. ఆ తర్వాత సంక్రాంతి హడావుడి మొదలైపోయింది. ఈ లోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుండే ‘బుట్టబొమ్మ, సార్’ చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. ‘బుట్టబొమ్మ’ నిరాశ పర్చినా, ‘సార్’ మూవీ చక్కని విజయాన్ని అందుకుంది. దాంతో… ఇప్పుడు సూర్యదేవర నాగవంశీ ‘ఇంటిటి రామాయణం’ విడుదల విషయంలో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ముందు అనుకున్నట్టుగా ఓటీటీలో కాకుండా దీన్ని థియేట్రికల్ రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట. ‘బలగం’ సినిమాను ‘దిల్’ రాజు ప్రివ్యూస్ వేసి పాజిటివ్ టాక్ తో భారీగా విడుదల చేస్తున్నట్టుగానే… తమ ‘ఇంటింటి రామాయణం’ మూవీని ప్రివ్యూ వేసి గుడ్ టాక్ తో రిలీజ్ చేస్తే బాగుంటుందని నాగవంశీ భావించారట. అందులో భాగంగానే ఈ నెల 5వ తేదీ కరీంనగర్ ప్రతిమా మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ జరుపబోతున్నారు. దీనికి చిత్ర బృందం హాజరు కానుంది. సో… ‘బలగం’ లానే పాజిటివ్ టాక్ ‘ఇంటిటి రామాయణం’కూ వస్తే… సూర్యదేవర నాగవంశీ కూడా దీన్ని అతి త్వరలోనే థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసే ఆస్కారం ఉంది. చూద్దాం… ఏం జరుగుతుందో!