Prabhas Birthday Special: ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’గా ప్రభాస్‌ను తెలుగువారు కీర్తిస్తున్నారు. బహుశా ఈ అభినందనలు ఉత్తరాదివారికి రుచించక పోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ కంటే ముందు హిందీ చిత్రసీమకు చెందిన అమితాబ్ బచ్చన్, నసీరుద్దీన్ షా, ఓం పురి, ఇర్ఫాన్ ఖాన్ వంటి వారు హాలీవుడ్ మూవీస్ లోనూ నటించి మెప్పించారు. కానీ, ఓ ప్రాంతీయ కథానాయకుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో మెప్పించిన వైనం ఒక్క ప్రభాస్ విషయంలోనే ముందుగా సాధ్యమయిందని చెప్పవచ్చు. అందువల్ల ప్రభాస్ ను ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’గా కీర్తించడంలో తప్పులేదంటారు మనవాళ్ళు. ప్రస్తుతం ప్రభాస్ పేరు యావద్భారతంలో మారుమోగిపోతోంది. ‘బాహుబలి’గా ప్రభాస్ అభినయం ఆబాలగోపాలాన్నీ అలరించింది. అప్పటి నుంచీ ప్రభాస్ సినిమాలకై మన దేశంలోని సినీ ఫ్యాన్స్, విదేశాల్లోని భారతీయులు కళ్ళింతలు చేసుకొని చూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తరువాత ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. అయినా ప్రభాస్ సినిమాలకు మాత్రం క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ ఇప్పటికే కొన్ని వివాదాలకు తెరతీసింది. అయినప్పటికీ ఆ సినిమా వస్తే చూసేయాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదీ ప్రభాస్ స్టార్ డమ్ అని చెప్పవచ్చు.
ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజుగా 1979 అక్టోబర్ 23న ప్రభాస్ జన్మించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత తమ్ముడు సూర్యనారాయణ రాజు చిన్న కొడుకు ప్రభాస్. కృష్ణంరాజు హీరోగా గోపీకృష్ణా మూవీస్ పతాకంపై ‘భక్త కన్నప్ప, అమరదీపం, శివమెత్తిన సత్యం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు’ వంటి చిత్రాలను నిర్మించారు సూర్యనారాయణ రాజు. కృష్ణంరాజు రెబల్ స్టార్ గా జనం మదిలో నిలిచారు. పెదనాన్న బాటలోనే పయనిస్తూ నటనను ఎంచుకున్న ప్రభాస్ ‘యంగ్ రెబల్ స్టార్’గా అభిమానులను ఆకట్టుకున్నారు. 2002లో ‘ఈశ్వర్’ సినిమాతో తొలిసారి హీరోగా జనం ముందుకు వచ్చారు ప్రభాస్. తరువాత ‘రాఘవేంద్ర’గానూ ఆకట్టుకున్నారు ప్రభాస్. ఎమ్మెస్ రాజు నిర్మించిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్ కు తొలి ఘన విజయాన్ని అందించింది. ఆ సినిమా తరువాత మాస్ ను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. వైవిధ్యం చూపించాలనీ తపించారు. కానీ, రాజమౌళి ‘ఛత్రపతి’ ప్రభాస్ ను మాస్ హీరోగా నిలిపింది. ఆ ఒక్క చిత్రంతోనే ‘యంగ్ రెబల్ స్టార్’ దశతిరిగిపోయింది.
Read Also: OTT Updates: ధనుష్ ‘నేనే వస్తున్నా’ ఓటీటీ డేట్ ఫిక్స్
‘ఛత్రపతి’ తరువాత ప్రభాస్ సినీ ప్రయాణంలో ‘పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, రెబల్’ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో ‘బిల్లా, రెబల్’ వంటి చిత్రాల్లో పెదనాన్న కృష్ణంరాజుతో కలసి ప్రభాస్ నటించడం అభిమానులను ఆకట్టుకుంది. ‘ఛత్రపతి’ తరువాత మళ్ళీ ప్రభాస్ కు ఆ స్థాయి సక్సెస్ ను ‘మిర్చి’ మాత్రమే అందించ గలిగింది. మిర్చి’ తరువాత ప్రభుదేవా తెరకెక్కించిన ‘యాక్షన్ జాక్సన్’ అనే హిందీ చిత్రంలో ప్రభాస్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. 2015లో తొలిసారి ‘బాహుబలి’గా జనం ముందు నిలిచారు ప్రభాస్. ఆ సినిమా అఖండవిజయంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో స్టార్ అయిపోయారు. ఆ తరువాత వచ్చిన ‘బాహుబలి’ రెండో భాగంతో ఏకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ భళా అనిపించారు ప్రభాస్. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ సినిమా అంటే ‘ప్యాన్ ఇండియా మూవీ’ అనే మాట ఖాయమయింది.
రామాయణం ఆధారంగా ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రానుంది. ఇక ‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ ‘సలార్’గా నటించారు. ఈ సినిమా వచ్చే యేడాది సెప్టెంబర్ లో జనం ముందుకు రానుంది. ఇదయ్యాక ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించే టైమ్ మిషన్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’లోనూ ప్రభాస్ నటించనున్నారు. ఒకప్పుడు కృష్ణంరాజు ఒడ్డూ పొడుగూ చూసి ఆయనను జనం ‘ఆంధ్రా అమితాబ్’ అని పిలిచేవారు. ఇప్పుడు కృష్ణంరాజు నటవారసుడైన ప్రభాస్ తన ‘ప్రాజెక్ట్ కె’లో ఆ అమితాబ్ బచ్చన్ తోనే కలసి నటిస్తూ ఉండడం విశేషం! ఇలా తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తూ ప్రభాస్ పయనం సాగిస్తున్నారు. ఇవి పూర్తయ్యాక ‘స్పిరిట్’ అనే చిత్రంలోనూ ప్రభాస్ నటిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ, జపనీస్, చైనీస్, కొరియన్ భాషల్లోనూ తెరకెక్కనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ప్రభాస్ తనకు లభించిన ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’ అనే గుర్తింపుకు తగ్గట్టుగానే తన సినీ ప్రయాణం సాగిస్తున్నారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ మరింతగా జనాన్ని మురిపిస్తారని ఆశిద్దాం.
(అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు)