ఇవాల్టి రోజుల్లో ఒక సినిమా హిట్ అయితే జబ్బలు చరుచుకుంటూ అంతా తమ గొప్పే అని చాటింపు వేసుకునే రోజులు ఇవి. అయితే ‘కెజిఎఫ్, కెజిఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి కూడా హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సినిమా మీద సినిమా ప్రకటిస్తూ సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నిండలే’. దీనికి మన జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత యశ్ తో ‘మాస్టర్ పీస్’ తీశారు. మూడో సినిమాగా పునీత్ తో తీసిన ‘రాజకుమార’ ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఆపై చరిత్ర మొదలైంది. యశ్, ప్రశాంత్ నీల్ తో ‘కెజిఎఫ్’ తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ‘కెజిఎఫ్2’ కి ముందు పునీత్ చివరి సినిమాగా విడుదలైన ‘యువరత్న’ ను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్ సంస్థే. ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్2’ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా పోగేయటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉండటం గమనార్హం. అందులో మొదటిది ప్రభాస్ తో తీస్తున్న ‘సలార్’.
ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్. ఇక ఈ ఏడాది ఆగస్ట్ 5న విడుదల కాబోతున్న జగ్గేశ్, శ్వేత శ్రీవాత్సవ్ సినిమా ‘రాఘవేంద్రస్టోర్స్’, రిషిబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘కాంటారా’ ఇదే ఏడాది పెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటించి దర్శకత్వం వహిస్తున్న ‘టైసన్’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ రచనతో శ్రీమురళి హీరోగా ‘భగీరా’ షూటింగ్ దశలో ఉంది. ‘లూసియా’ ఫేమ్ పవన్ కుమార్ తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. నిజానికి ఇందులో పునీత్ రాజ్ కుమార్ నటించాల్సింది. ఆయన లేరు కాబట్టి మరో హీరోతో ప్రొసీడ్ కానున్నారు. రక్షిత్ శెట్టి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘ఉలిదవరు కందంతే’ కి సీక్వెల్ గా ‘రిచర్డ్ ఆంటోని’ సినిమాను తెరకెక్కిస్తోంది హోంబలే ఫిలిమ్స్. ఇవి కాకుండా సుధాకొంగర దర్శకత్వంలో మూవీ చేయటానికి కమిట్ అయింది. మరి వరుసగా నాన్ స్టాప్ గా సినిమాలు ప్లాన్ చేస్తూ దక్షిణాదిన ఒకే సారి 8 సినిమాలు నిర్మిస్తున్న ఏకైక సంస్థగా ముందుకు సాగుతున్న హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాలతో ఏ స్థాయి విజయాలను అందుకుంటుందో చూడాలి.