Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..

Tollywood Directors

Tollywood Directors

Tollywood Directors: టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస ఫ్లాపులు వచ్చిన దర్శకులకు హీరోలు దొరకడం కష్టమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకులు సైతం తమ నెక్ట్స్ సినిమాల కోసం హీరోల డేట్స్ దొరక్క వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల, చందూ మొండేటి, వివేక్ ఆత్రేయ వంటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

‘కుబేర’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇప్పటికే తన నెక్ట్స్ సినిమా స్టోరీని రెడీ చేసినట్లు సమాచారం. అయితే ఈ కథకు సరిపోయే స్టార్ హీరో కోసం ఆయన అన్వేషణ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. గతంలో నాని, నాగచైతన్య పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతం వారిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో వారి డేట్స్ దొరకడం లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ‘తండేల్’ సక్సె్స్‌తో కెరీర్‌లో మరో భారీ హిట్ అందుకున్న చందూ మొండేటి తొలుత ‘వాయుపుత్ర’ అనే యానిమేషన్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే బడ్జెట్ భారీగా పెరగడంతో ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆయన మరో మైథాలజికల్ పీరియాడిక్ స్టోరీని సిద్ధం చేసి హీరోల కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ కథలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లేదా రానా దగ్గుబాటి నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక డైరెక్టర్ వివేక్ ఆత్రేయ విషయానికి వస్తే, ‘సరిపోదా శనివారం’ సక్సెస్ అనంతరం ఈ యువ దర్శకుడు తన నెక్ట్స్ సినిమా కోసం తెలుగు హీరోలతో పాటు తమిళ స్టార్ హీరోలకు కూడా కథలు వినిపించినట్లు టాక్. రజనీకాంత్, సూర్యలకు కథ చెప్పినా ప్రాజెక్ట్‌లు కార్యరూపం దాల్చలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం బాలకృష్ణకు కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆయన ఇతర కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఆ తర్వాత రవితేజను కూడా సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ముగ్గురు దర్శకుల నుంచి ఇప్పటివరకు కొత్త సినిమాలపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. హీరోల డేట్స్ ఖరారైన తర్వాతే ఈ క్రేజీ ప్రాజెక్టులు సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ హిట్ దర్శకుల నెక్ట్స్ సినిమాలు ఎప్పుడు ప్రకటిస్తారో అన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.