Hit-2 movie is back with Major’ promotions!
అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే… ఈ నెల 29న అడివి శేష్ ‘హిట్ -2’ మూవీ జనం ముందుకు వచ్చి ఉండేది. కానీ తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తాడనేది నానుడి. ‘హిట్ -2’ విషయంలోనూ అదే జరిగింది! బట్ జరిగేదంతా మంచికే అనుకోమంటారు పాజిటివ్ థింకింగ్ పీపుల్. ప్రస్తుతం ‘హిట్ 2’ టీమ్ కూడా ఇదే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంది. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ కూడా స్పష్టం చేశాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ మూవీ విడుదల తర్వాత అన్ని ప్రాంతాలకూ దానిని తీసుకెళ్ళడం తన బాధ్యతగా భావించానని శేష్ తెలిపాడు. ఈ క్రమంలో శరీరకంగా, మానసికంగా బాగా అలిసి పోయానని అన్నాడు. అయితే దీనిని పాజిటివ్ గానూ తీసుకోవాలని కోరాడు. ‘మేజర్’ ప్రమోషన్స్ కారణంగా ‘హిట్ -2’ చివరి షెడ్యూల్ లో పాల్గొనలేకపోయానని, ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో అందుకు సిద్ధమౌతున్నానని చెప్పాడు. ‘హిట్ -2’ నిర్మాతలతో పాటు దర్శకుడు శైలేష్ కొలను కూడా తన పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించారని అడివి శేష్ తెలిపాడు. అతి త్వరలోనే ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ను పూర్తి చేస్తానని, ఆ వెంటనే వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చాడు. ఇందులోని కృష్ణ దేవ్ (కేడీ)ను ఎప్పుడు జనం ముందుకు తీసుకొచ్చేది త్వరలోనే చెబుతామని అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో జరిగే కథగా ఈ మూవీ ఉండబోతోంది. దీన్ని నాని సమర్పణలో ప్రముఖ స్టైలిస్ట్ ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్నారు.