యూఫరియా
అంటేనే అత్యంత ఆనందోత్సాహం. ఆ టైటిల్ ను టీనేజ్ డ్రామా కోసం ఏ ముహూర్తాన నిర్ణయించారో కానీ, యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. హెచ్.బి.ఓ. లో యూఫరియా
సీజన్ 2 , జనవరి 9 న మొదలయింది. యువతను కిర్రెక్కిస్తోంది. 2019 జూన్ 16న తొలి సీజన్ మొదలై, అమెరికా జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగానూ ఈ సీరిస్ అలరించింది. నిజానికి యూఫరియా
కు స్ఫూర్తి అదే పేరుతో ఇజ్రాయెల్ లో రూపొందిన టీనేజ్ డ్రామా. 2012 నవంబర్ 30న ఇజ్రాయెల్ హాట్ 3లో మొదలైన ఈ టీనేజ్ డ్రామా 2013 ఫిబ్రవరి 13 దాకా సాగింది. ఈ కథ విషయానికి వస్తే 1990లలో పదిహేడేళ్ళ వయసున్న కొంతమంది డ్రగ్స్, సెక్స్, అకృత్యాలకు పాల్పడే నేపథ్యంలో కథ సాగుతుంది. నిజానికి వారికి సరైన దిశానిర్దేశం లేకపోవడం వల్లే అలా చెడిపోయారనే అంశంతో ఈ సీరిస్ రూపొందింది. కన్నవారి ఆలనాపాలనా లేనివారు, అనాథలు ఎందుకని దుర్వ్యసనాలకు బానిసలవుతున్నారో ఈ యూఫరియా
లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజం చెప్పాలంటే ఇందులోని చాలా ఎపిసోడ్స్ నిజజీవితానికి చెందినవే నని అంటారు. రాన్ లేషేమ్ రాసిన స్క్రిప్ట్ ఆధారంగా యూఫరియా
తెరకెక్కింది. ఇందులో అన్నీ టీనేజ్ పాత్రలే కనిపిస్తాయి. ఎక్కడో అడపా దడపా పెద్దమనుషులు కనిపించినా, వారి ముఖాలు కనిపించకుండా చిత్రీకరించడం ఈ సీరిస్ ప్రత్యేకత!
ఇప్పుడు అమెరికాలో యూఫరియా
ఇంగ్లిష్ జనాన్ని విశేషంగా అలరిస్తోంది. హెచ్.బి.వో. లో జనవరి 9న యూఫరియా
సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఏకంగా 14 మిలియన్ల వ్యూవర్ షిప్ చూసిందట. ఫస్ట్ సీజన్ తొలి ఎపిసోడ్ కు 6.6 మిలియన్ల వ్యూయర్ షిప్ లభించింది. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ మంది ఈ సారి యూఫరియా
ను తిలకించారన్న మాట. ఈ లెక్క బాగానే ఉంది. ఆన్ ఎయిర్ ట్యూనింగ్ లో ఈ సీజన్ చూసిన వారి సంఖ్య కేవలం 254,000 అనే తేలుతోంది. అంటే 14 మిలియన్లలో రెండు శాతం కంటే తక్కువేనన్న మాట. ఇతరత్రా ఫ్లాట్ ఫామ్స్ పైనే ఎక్కువమంది చూశారని తేలుతోంది. మరి రాబోయే మూడో సీజన్ ను జనం ఏ తీరున వీక్షిస్తారో చూడాలి.