Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే పవన్ – హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇన్నాళ్లకు ఈ కాంబో ఉస్తాద్ తో రాబోతుంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. తమిళ్ లో హిట్ అయిన తేరి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఆ కథలోని లైన్ తీసుకున్నాం కానీ, పూర్తిగా రీమేక్ చేయలేదు అని హరీష్ కుండబద్దలు కొట్టేశాడు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత ఎక్కువయ్యింది. ఇక ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ కూడా తేరి సినిమాకు అస్సలు సంబంధం కూడా లేకపోవడంతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. కొద్దిసేపటి క్రితమే ఉస్తాద్ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అమెజాన్ ఈ ఏడాది ఏఏ సినిమాలను రిలీజ్ చేస్తుందో చెప్తూ ఒక ఈవెంట్ ను నిర్వహించింది. అందులో భాగంగా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో మొత్తం పవన్ హీరోయిజాన్ని చూపించారు. పవర్ ఫుల్ పోలీస్ గా అన్యాయాన్ని అరికట్టడానికి ఉస్తాద్ ఎలా పోరాడాడు అన్నది చూపించారు. కానీ, డైలాగ్స్ మొత్తం గాజు గ్లాస్ గురించి మాత్రం ఉండడమే కొంతవరకు అనుమానాలకు దారితీస్తుంది. అసలు సినిమాకు, ఆ గాజు గ్లాస్ కు సంబంధం ఏంటి.. ?. సరే పవన్ పార్టీ గుర్తు గాజు గ్లాసునే.. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇలాంటి పవర్ పంచ్ లు సినిమాల్లో చూపించడం సాధారణమే. కానీ, ఈ వీడియోలో పవన్.. పూర్తిగా గాజు గ్లాసు గురించే చెప్పడం మరి ఓవర్ గా అనిపించిందని అంటున్నారు. అసలు సినిమాకు సంబంధం లేని ఒక గాజు గ్లాస్ గురించి టీజర్ గా కట్ చేసిన విధానం ఓవర్ గా అనిపిస్తుందని, కావాలనే ఈ డైలాగ్స్ చెప్పించినట్లు అనిపిస్తుందని అంటున్నారు. ఇదేదో పొలిటికల్ యాడ్ లా ఉందని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు. మరి ఈ డైలాగ్స్ ఈ పొలిటికల్ హీట్ ను పెంచడానికే ఉన్నాయా.. ? సినిమాలో కూడా ఉంటాయా.. ? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.