ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సర్కారు వారి పాట’ హంగామానే నడుస్తోంది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ఈ చిత్రం.. ఈరోజే (మే 12) ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య వచ్చింది. అంచనాలకి తగ్గట్టుగానే ఇది ఆకట్టుకోవడంతో, సర్వత్రా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా.. చాలాకాలం తర్వాత వింటేజ్ మహేశ్ బాబుని చూశామన్న అభిప్రాయాల్ని ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా వ్యక్తపరుస్తున్నారు. కేవలం సినీ ప్రియులే కాదండోయ్.. సెలెబ్రిటీలు సైతం ఆ యూఫోరియాను ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా చూసిన దర్శకుడు హరీశ్ శంకర్.. ట్విటర్ మాధ్యమంగా తన రివ్యూ ఇచ్చాడు. ‘‘ఈ సినిమాలో మహేశ్ బాబు స్వాగ్, టైమింగ్ అదిరిపోయాయి. నిజంగా ‘సర్కారు వారి పాట’ ఓ రియల్ ట్రీట్ లాంటిది. హిలేరియస్, పవర్ఫుల్ పాత్రల్ని ప్రెజెంట్ చేసిన దర్శకుడు పరశురామ్‌కి హ్యాట్సాఫ్. ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ దిష్టి తీయించుకోవాలి’’ అంటూ హరీశ్ చెప్పుకొచ్చాడు. అసలే ఫ్యాన్స్ పాజిటివ్ టాక్ వచ్చిన ఆనందంలో మునిగితేలుతుండగా, హరీశ్ ఇచ్చిన రివ్యూతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొత్తానికి, తమ ఆకలి తీర్చేలా మహేశ్ అదిరిపోయే సినిమాతో వచ్చాడని, తమ అభిమాన హీరోని ఇలా ‘వింటేజ్’ రూపంలో చూపించినందుకు పరశురామ్‌కి థ్యాంక్స్ చెప్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలావుండగా.. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఈ అమ్మడు సినిమాలో అందంగా కనిపించడంతో పాటు తన నటనతో ఆకట్టుకుందని మంచి మార్కులు పడ్డాయి. మహేశ్, కీర్తి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్.. వారి మధ్య కెమిస్ట్రీకి పొగడ్తల వర్షం కురుస్తోంది. అటు, కొంతకాలం నుంచి టైమింగ్ కోల్పోయిన వెన్నెల కిశోర్ కూడా ఇందులో అదరగొట్టాడని అంటున్నారు.