టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. మత్తు వదలరా చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య, మత్తు వదలరా ఫేమ్ అగస్త్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. “సురియల్ కామెడీ అంటే ఏంటి సుయోధనా.. అది ట్రైలర్ చూస్తే తెలుస్తుందిరా నాయనా” అని వెన్నెల కిషోర్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమవుతోంది.
నో గన్ .. నో ఎంట్రీ అని మంత్రి వెన్నెల కిషోర్ పాస్ చేసిన ఆదేశంతో ఊర్లో ఉన్నవారందరూ తమ తాహతుకు తగ్గట్లు గన్ లు కొంటారు. ఈ నేపథ్యంలోనే డైమండ్ పొదిగిన లైటర్ ఒకటి మిస్ అవుతోంది.. ఆ లైటర్ కోసం మాఫియా గ్యాంగ్ కు లావణ్య బ్యాచ్ కు మధ్య జరిగే యుద్ధమే సినిమా కథగా తెలుస్తోంది. అసలు ఆ లైటర్ ఎవరిది..? వెన్నెల కిషోర్ గన్స్ ఉండాలని ఎందుకు ఆదేశాలు జారీ చేశాడు. అస్సలు హ్యాపీ బర్త్ డే అనే టైటిల్ కు కథకు సంబంధం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. ఇక ట్రైలర్ చివర్లో మత్తు వదలరా చిత్రంలోని సీరియల్ సీన్స్ రత్నం ను యాడ్ చేసి మరింత ఆసక్తిని పెంచేశారు. ట్రైలర్ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ అని తెలిసేలా కట్ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య రోల్స్ చూస్తుంటే కామెడీకి ఢోకా లేదని అర్ధమవుతోంది. జూలై 8 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా లావణ్యకు హిట్ ను అందిస్తుందో లేదో చూడాలి.