(ఫిబ్రవరి 4న డాక్టర్ రాజశేఖర్ పుట్టినరోజు)
డాక్టర్ రాజశేఖర్ తెరపై కనిపించగానే, ఆయన అభిమానుల ఆనందం అంబరమంటేది. యాంగ్రీ మేన్
గా ఈ నాటికీ ఆయన అలరిస్తున్న తీరు మరపురానిది. ఇప్పటికీ తనకు తగ్గ పాత్రలు పోషించడానికి ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు రాజశేఖర్. ఆ ఉత్సాహమే ఆయన అభిమానులనకు ఆనందం పంచుతోంది. ఓ వైపు తన ఇద్దరు కూతుళ్లు హీరోయిన్లు గా నటిస్తున్న సమయంలో రాజశేఖర్ ఇప్పటకీ హీరో వేషాలతో అలరించే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం!
రాజశేఖర్ పూర్తి పేరు రాజశేఖర్ వరదరాజన్. 1962 ఫిబ్రవరి 4న ఆయన జన్మించారు. తేని జిల్లాలోని లక్ష్మీపురం రాజశేఖర్ జన్మస్థలం. ఆయన తండ్రి డి.సి.వరదరాజన్ పోలీస్ ఆఫీసర్. ఇంట్లో అందరికంటే పెద్దవాడయిన రాజశేఖర్ కన్నవారి కలలు నెరవేరుస్తూ బుద్ధిగా చదువుకొని డాక్టర్ అనిపించుకున్నారు. డాక్టర్ చదివే రోజుల్లోనే ఆయనకు ఉన్న నటనాభిలాషను గమనించి పలువురు మిత్రులు ప్రోత్సహించారు. అయితే ఎమ్.బి.బి.యస్., పూర్తయిన తరువాతే నటన అంటూ ముందు డాక్టర్ గిరీ పూర్తి చేసి,కొద్ది రోజులు మద్రాసులో ప్రాక్టీస్ కూడా పెట్టారు. తరువాత భారతీరాజా తెరకెక్కించినపుదుమై పెన్
చిత్రంలో ఓ కీలక పాత్ర ద్వారా చిత్రసీమలో ప్రవేశించారు రాజశేఖర్. తెలుగులో ప్రతిఘటన
చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ చిత్రంలో పోలీసాఫీసర్ గా నటించిన రాజశేఖర్ ఆ తరువాత అంకుశం
లోనూ పవర్ ఫుల్ పోలీస్ గా నటించి ఆకట్టుకున్నారు. అంకుశం
ఘనవిజయం రాజశేఖర్ కు యాంగ్రీ మేన్ గుర్తింపు సంపాదించి పెట్టింది. ఆ తరువాత వరుసగా పలు పవర్ ఫుల్ రోల్స్ నటించి ఆకట్టుకున్నారాయన. మొదట్లోనే పలు వైవిధ్యమైన పాత్రలతో మురిపించారు రాజశేఖర్. తలంబ్రాలు
లో రాజశేఖర్ అభినయానికి బెస్ట్ విలన్ గా ఆయనకు నంది అవార్డు లభించింది. ఆ పై రెగ్యులర్ కమర్షియల్ హీరోస్ లాగా అల్లరి ప్రియుడు
సినిమాతో మారిపోయారు. రాజశేఖర్ సైతం స్టెప్స్ తో మురిపిస్తాడని జనం అల్లరి ప్రియుడుకు జేజేలు పలికారు.
రాజశేఖర్ షూటింగ్స్ కు సరైన సమయానికి రారు అనే పేరు సంపాదించారు. అయినా కొన్ని పాత్రలకు రాజశేఖర్ మాత్రమే న్యాయం చేయగలరని భావించిన వారు ఆయననే తమ హీరోగా ఎంచుకునేవారు. రావడంలో ఆలస్యం ఉంటుందేమో కానీ, వచ్చిన తరువాత అందరూ మెచ్చేలా నటించడానికి తపించేవారు రాజశేఖర్. అందుకే ఆయన ఎప్పుడు వచ్చినా సరే, అదే భాగ్యం అనుకుంటూ చిత్రాలు రూపొందించి విజయం సాధించారు సినీజనం. తనదైన బాణీ పలికిస్తూ అనేక పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసిన రాజశేఖర్ ఆ మధ్య బాగా వెనకబడిపోయారు. గరుడవేగ
తో రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనేలా చేసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఆర్జీవీ దెయ్యం
లో విలక్షణమైన పాత్రలో అలరించారు. శేఖర్
అనే చిత్రంలో నటించారు రాజశేఖర్.
రాజశేఖర్ విజయం వెనుక ఆయన అర్ధాంగి జీవిత ఉన్నారని అందరికీ తెలుసు. ఈ దంపతుల కూతుళ్ళు శివానీ, శివాత్మిక సైతం కన్నవారి బాటలో పయనిస్తూ నటనలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర్ మరిన్ని చిత్రాలతో అలరిస్తారని అభిమానుల అభిలాష. ఈ యేడాదితో షష్టి పూర్తి చేసుకుంటున్న రాజశేఖర్ ఇకపై మరింతగా జనాన్ని మురిపిస్తారేమో చూడాలి.