Hanu Raghavapudi’s direction scared me: Ashwini Dutt
‘ఎప్పటి నుండో తీయాలనుకుంటున్న లవ్ స్టోరీని తన బ్యానర్ లో తీసే అవకాశం కుమార్తెలు స్వప్న, ప్రియాంక తనకు ఇచ్చార’ని ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ తెలిపారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, రశ్మికా మందణ్ణ, సుమంత్ కీలక పాత్రలు పోషించిన ‘సీతారామం’ మూవీ ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ‘యు’ సర్టిపికెట్ లభించింది. ఈ మూవీ గురించి అశ్వినీదత్ మీడియాతో మాట్లాడుతూ, ”మంచి సినిమా తీశాం. చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా హీరోహీరోయిన్లు చాలా అద్భుతంగా నటించారు. ఈ కథను నా దగ్గరకు మా పిల్లలు తీసుకొచ్చి, హను రాఘవపూడి దర్శకత్వం అనగానే సహజంగానే భయపడ్డాను. అతనితో యేడాది పాటు జర్నీ చేశాం. అన్ని సెట్ అయిన తర్వాత కరోనా మొదలైంది. ఎక్కడ షూటింగ్ చేద్దామన్నా ఇబ్బందిగానే అనిపించింది. అయినా కాస్తంత టైమ్ తీసుకుని దీన్ని పూర్తి చేశాం. హను రాఘవపూడి చాలా చక్కగా కథను తెరకెక్కించాడు. అతనికి కెమెరా సెన్స్ ఎక్కువ. ఫిల్మ్ మేకింగ్ మీద మంచి పట్టుంది” అని అన్నారు.
‘ఇవాళ థియేటర్లకు జనం రావడం తగ్గిపోయిందనే మాట ప్రతి చోటా వినిపిస్తోందని, ఓ టెస్టిమోనీ తరహాలో తమ చిత్రాన్ని విడుదల చేసి చూడాలని అనుకుంటున్నామ’ని అశ్వనీదత్ చెప్పారు. తాము సినిమాకు చేసిన పబ్లిసిటీ బట్టి మార్నింగ్ షో నుండే జనం థియేటర్లకు వస్తారనే నమ్మకం ఉందని, అలా కాకపోయినా… మూవీ టాక్ తో తప్పకుండా వస్తారని అన్నారు. ఆడియెన్స్ థియేటర్లకు రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని అశ్వనీదత్ చెబుతూ, ”అందులో మెయిన్ రీజన్ కరోనా. అయితే… ఇటీవల కాలంలో టిక్కెట్ రేట్లను పెంచడం, తగ్గించడం, మళ్ళీ పెంచడం తగ్గించడం చేశారు. ఇక కొందరు హీరోలు సీఎం ను కలిసి టిక్కెట్ రేట్లు పెంచుకున్నారనే అపోహలో కూడా ప్రేక్షకులు ఉన్నారు. ఇదిలా ఉంటే… కొన్ని థియేటర్లను లీజుకు తీసుకున్న కొందరు వ్యక్తులు అక్కడ కాఫీలు, సమోసాలను కూడా వాళ్ళే ఇష్టానుసారమైన రేట్లకు అమ్మేశారు. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడానికి విరక్తి చెందారు. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా థియేటర్లకు జనం రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి” అని వివరించారు.
సినిమా రంగం మీద తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకకు చక్కని అవగాహన ఉందని, ముఖ్యంగా స్వప్న ఆలోచన ధోరణి భిన్నంగా, కొత్తగా ఉంటుందని అన్నారు. అప్పట్లో ఎన్టీయార్, చిరంజీవితో తాను సినిమాలు నిర్మించినప్పుడు వారిద్దరూ తనకు వెన్నుదన్నుగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. తాజా చిత్రం ‘సీతారామం’ కు ప్రియాంక ఎక్కువ శ్రమ పడిందని, ఇదే సమయంలో తాము ‘అన్ని మంచి శకునములే’ మూవీ కూడా షూటింగ్ చేశామని, రెండు ప్రాజెక్ట్స్ ను స్వప్న చాలా బాలెన్డ్స్ గా చేసిందని, మొత్తం క్రెడిట్ ఆమెకు చెందుతుందని అశ్వనీదత్ చెప్పారు. సంగీతం మీద తనకు మొదటి నుండీ అభిరుచి ఉందని, అప్పట్లో కె. వి. మహదేవన్, ఇళయరాజా తన సంగీత పరిజ్ఞానాన్ని మెచ్చుకున్నారని, నిజానికి తనకు సరిగమలు అసలు తెలియవని, అయితే ఏది బాగుంటుందో, ఏది బాగోదో జడ్జ్ చేయగలనని అన్నారు. కె. రాఘవేంద్రరావుతో సినిమాలు చేసినప్పుడు కీరవాణి నుండి చక్కటి బాణీలు రాబట్టే పని ఆయననే భుజానకెత్తుకున్నారని తెలిపారు. ‘సీతారామం’ మూవీకి విశాల్ చంద్రశేఖర్ చక్కని సంగీతం అందించారని, అతని భార్య కంట్రిబ్యూషన్ కూడా ఎంతో ఉందని అన్నారు. ఇందులో చైల్డ్ సాంగ్ లో తాను ఇన్ వాల్వ్ అయ్యానని చెప్పారు.
దుల్కర్ సల్మాన్ గురించి చెబుతూ, ”మా బ్యానర్ లో అతను ‘మహానటి’లో జెమినీ గణేశన్ పాత్ర చేశాడు. దుల్కర్ ఆ పాత్రను అంగీకరించడమే ఓ విశేషం. అప్పుడే ప్రతి యేడాది దుల్కర్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నాం. ఈ సినిమా కథ హను చెప్పినప్పుడు కూడా నాకు మొదట దుల్కర్ మనసులో మెదిలాడు. దాంతో ఈ కథ అతనికే చెప్పమని అన్నాను. అతనికి దేశ వ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది. పైగా ఇలాంటి ప్రేమ కథకు అతనే యాప్ట్ అనిపించింది” అని అన్నారు. ఆ మధ్య వచ్చిన ‘రాధేశ్యామ్’ మూవీ ఫ్లాప్ కావడంతో తమ చిత్రానికి ‘సీతారామం’ అనే పేరు పెట్టడం ఎంత వరకూ సబబు అనే చర్చకూడా తమ మధ్య జరిగిందని, దాంతో ‘లెఫ్టినెంట్ రామ్’ అనే టైటిల్ కూడా పరిశీలించామని, కానీ ఫైనల్ గా ఈ టైటిల్ కే ఫిక్స్ అయ్యామని, ఆ విషయంలో అప్పుడప్పుడూ నాగ్ అశ్విన్ సైతం సలహాలు ఇస్తుండేవాడని దత్ అన్నారు. బాలచందర్ ‘మరో చరిత్ర’, మణిరత్నం ‘గీతాంజలి’ తరహాలో ఇది కూడా లాండ్ మార్క్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఇందులో సుమంత్ మంచి పాత్ర చేశారని, ఇది పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుండటంతో అతను ఇతర భాషలకూ పరిచయం అయినట్టు అవుతుందని అన్నారు. ‘సీతారామం’ మూవీ ప్రమోషన్స్ ను కూడా పక్కాగా ప్లాన్ చేస్తున్నామని, అతి త్వరలోనే ఆడియోతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ నూ నిర్వహిస్తామని అశ్వనీదత్ చెప్పారు. ప్రభాస్ ఆపరేషన్ కు వెళ్ళాడని, అతను రాగలిగితే తప్పకుండా ఏదో ఒక ఫంక్షన్ కు పిలుస్తామ’ని చెప్పారు.
నాగచైతన్య హీరోగా నందినీరెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా అలానే శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా మరో సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నామని అశ్వినీదత్ తెలిపారు. తమ బ్యానర్ లో నిర్మితమౌతున్న ‘ప్రాజెక్ట్ కె’, ‘అన్ని మంచి శకునములే’ వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు.