గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా మరో అడుగు ముందుకేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కి సంబంధించిన కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి పాన్ ఇండియా బై లింగువల్ వెబ్ సిరీస్ ను రూపొందించబోతోంది. భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుపై వినయ్ సీతాపతి రాసిన ‘హాఫ్ లయన్’ పుస్తకం ఆధారంగా ఈ రెండు సంస్థలు కలిసి ఓ వెబ్ సీరిస్ ను నిర్మించబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను ప్రముఖ నిర్మాత, .గీతా ఆర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఆహా ప్రమోటర్ అల్లు అరవింద్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ సమీర్ నాయర్ ముంబైలో వెలువరిచారు.
‘గంగాజల్, అపహరణ్, రాజ్‌నీతి’ వంటి సోషియో పొలిటికల్ చిత్రాలు, అవార్డ్ విన్నింగ్ డ్రామా సిరీస్ ‘అస్త్రం’ వంటి వాటితో ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత ప్రకాష్ ఝా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. 2023లో ‘హాఫ్ లయన్’ తెలుగు, హిందీ, తమిళంలో విడుదలవుతుంది. దీని గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ, ”ఆహాతో తెలుగులో సాగుతున్న మా జర్నీ మరుపురానిదనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానం కారణంగా రెండేళ్లలోనే ఆహా యాప్ చాలా త్వరిత గతిన అభివృద్ధి చెందింది. ఈ క్రమంలో ఆహా మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమీర్ నాయర్ గారి భాగస్వామ్యంతో భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహా రావుగారి కథను గ్లోబల్ ఆడియెన్స్‌కు అందించబోతున్నాం” అని అన్నారు.
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ సమీర్ నాయర్ మాట్లాడుతూ ”మా కాంబినేషన్ సరిహద్దులను చేరిపేసే కంటెంట్‌ను క్రియేట్ చేస్తుందని భావిస్తున్నాం. ఆహా స్టూడియో ద్వారా మాతో కలిసి ఇలాంటి సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు. మా తొలి ప్రయతాన్ని ఆవిష్కరిస్తున్న దర్శకుడు ప్రకాష్ ఝా గారికి కూడా థాంక్స్. భవిష్యత్తులో మరిన్ని కొత్త ప్రాజెక్టులను రూపొందిస్తాం” అని అన్నారు. దర్శకుడు ప్రకాశ్ ఝా మాట్లాడుతూ ”రియల్ లైఫ్ స్టోరీస్, సబ్జెక్ట్స్‌పై వర్క్ చేయడం ఎప్పుడూ చాలా కొత్తగా, ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. ఆహా వంటి మాధ్యమంలో ఇలాంటి కాన్సెప్ట్స్ చేయడం అనేది హ్యాపీగా ఉంది. ఇక అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే కంటెంట్‌ను క్రియేటింగ్‌లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అలాంటి సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం అనేది ఎగ్జయిట్‌మెంట్‌ను మరింత పెంచుతుంది. ఈరోజు దేశం ఇలా ముందుకు వెళుతుందంటే, అందుకు కారణంగా ఉండి ఎంతో కీలకమైన పాత్రలు పోషించిన వ్యక్తుల్లో పి.వి. నరసింహారావు ఒకరు. ఆయన గురించి వెబ్ సిరీస్ చేయడం ఆనందంగా ఉంది. నేటి తరం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయనేది నా నమ్మకం” అని అన్నారు.