టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఇప్పుడు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అక్షయ్ కుమార్ హిందీ చిత్రం ‘రామ్ సేతు’లో కీలక పాత్ర పోషిస్తున్న సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్సే’ జనవరి మాసంలో రిపబ్లిక్ డే కానుకగా రాబోతోంది. అలానే మరో చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ఫిబ్రవరి నెలలో విడుదల కానుంది. సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగశేఖర్ ‘గుర్తుందా శీతాకాలం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. కన్నడ చిత్రం ‘లవ్ మాక్ టైల్’కు ఇది రీమేక్.
Read Also : బన్నీ ‘స్పైడర్‌మ్యాన్’ని ఓడిస్తాడా!?
ఈ మూవీ గురించి దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ, ”ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో సెటిల్ అయినప్పటికీ, కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం” అని అన్నారు. భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాశ్, కావ్యశెట్టి సైతం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఈ యేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, మూవీని ఫిబ్రవరి 2022లో రిలీజ్ చేయాలనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు.