Karthikeya2: నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘కార్తికేయ2’ చిత్రం జాతీయ స్థాయిలో చక్కని కలెక్షన్లను రాబడుతోంది. ఇటీవలే ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చోటు దక్కించుకున్న సందర్భంగా కర్నూల్ లో చిత్ర బృందం ఘనంగా వేడుక జరుపుకుంది.
తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్ సైతం ‘కార్తికేయ2’ బృందాన్ని అభినందించారు. కథానుగుణంగా గుజరాత్ లోని సోమనాథ్, ద్వారక ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ లో అత్యధిక భాగాన్ని చిత్రీకరించారు. కృష్ణతత్త్వాన్ని తెలియచేసే ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితం కావడం పట్ల సీ.ఎం. భూపేంద్ర హర్షం వ్యక్తం చేశారని తెలిసింది. సినిమా విడుదలకు ముందే కథ గురించి తెలుసుకుని మధురలోని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి, సత్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విడుదల తర్వాత కూడా దేశ వ్యాప్తంగా మూవీ టీమ్ కు అదే ఆదరణ పలు రాష్ట్రాల నుండి లభిస్తోంది. ఈ సందర్భంగా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు.